Begin typing your search above and press return to search.

నగదు కొరత: పింఛన్ల పంపిణీలో జాప్యం..

By:  Tupaki Desk   |   3 Aug 2019 8:49 AM GMT
నగదు కొరత: పింఛన్ల పంపిణీలో జాప్యం..
X
వృద్ధులు -వికలాంగులు- ఒంటరి మహిళలు- దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల పంపిణీలో జాప్యం కొనసాగుతోంది. నగదు కొరతతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో 50శాతం మాత్రమే పింఛన్లను పంచిన వైనం తాజాగా వెలుగుచూసింది.

ప్రకాశం సహా వివిధ జిల్లాల్లో పింఛన్లకు నిధుల కొరత వచ్చింది. సగానికి పైగా మండలాల్లో లబ్ధిదారులకు శుక్రవారం రెండో తారీఖున పింఛన్లు అందలేదు. రెండో తేదీకి అందాల్సి ఉండగా శుక్రవారం 53శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాల్లో 12 విభాగాల కింద ప్రతీ నెల సామాజిక భద్రత పింఛన్లను పంచుతుంటారు. ఎనిమిది విభాగాల లబ్ధిదారులకు రూ.2వేలు, కిడ్నీ బాధితులకు 3500, వైకల్యం గల వారికి 3వేల చొప్పున పంపిణీ చేస్తారు.

అయితే తాజాగా ప్రభుత్వం నుంచి ఈ పింఛన్ డబ్బును జిల్లాల్లోని డీఆర్డీఏకు విడుదల చేస్తారు. ప్రతీనెల 30వ తేదీకే నగదు బదిలీ ఖాతాల్లో పడిపోతుంది. కానీ ఈసారి మొత్తం నగదులో 50శాతం మాత్రమే 30వ తేదీన పడింది. మిగతా 50శాతం నగదు జమలో ఆలస్యమైందట.. దీంతో మిగత నగదు కోసం అధికారులు గ్రామాలను వదిలి మండల కార్యాలయాలకు చేరుకున్నారు.

పింఛన్ దారులంతా పంచాయతీ ఆఫీసుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నగదు కొరతతో అధికారులు సగం పంచి మిగతా సగం వచ్చాక పంచుదామని వేచిచూస్తున్నారు. శనివారం కానీ సోమవారం కానీ నగదు నిధులు విడుదలైతే పింఛన్ దారులకు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.