Begin typing your search above and press return to search.

నీ ఉప్మా డబ్బులు ఇదిగో.. మనియార్డర్లతో ముద్రగడకు షాక్

By:  Tupaki Desk   |   23 Jun 2023 12:00 PM GMT
నీ ఉప్మా డబ్బులు ఇదిగో.. మనియార్డర్లతో ముద్రగడకు షాక్
X
కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభానికి కొత్త షాక్ తగిలింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో జనసైనికులు తమ వినూత్న నిరసనను ముద్రగడకు తెలియజేస్తన్నారు. ప్రస్తుతం ఆయనకు రూ.50 నుంచి రూ.వెయ్యి వరకు మనియార్డర్లు పంపుతున్నారు. కాపు ఉద్యమం వేళ తిన్న నీ ఉప్మా డబ్బులు ఇదిగో అంటూ వారు వరుస పెట్టి మనియార్డర్లు చేస్తున్నారు.

కాపు రిజర్వేషన్ల పోరాటానికి ద్వారంపూడి సహకరించారని.. అలాంటి వ్యక్తిపై ఎందుకు నిందలు వేస్తారంటూ పవన్ కు రాసిన బహిరంగ లేఖలో ముద్రగడ ప్రశ్నించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడపై జనసైనికులు మండిపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని తాకట్టు పెట్టిన ముద్రగడను తిట్టి పోస్తున్నారు.

కాపు ఉద్యమ సమయంలో తెలియక ఆయన పెట్టిన ఉప్మా తిన్నామని.. ఆయన పెట్టిన ఉప్మాకు డబ్బులు ద్వారంపూడి పంపిన విషయం తెలిసిన తర్వాత.. తాము తిన్న ఉప్మాకు డబ్బులు పంపిస్తున్నట్లుగా పేర్కొంటూ వరుస పెట్టి మనియార్డర్లు చేస్తున్నారు.

కాపు ఉద్యమం జరిగిన సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకరించారని ముద్రగడ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో.. ఈ వినూత్న నిరసనకు తెర తీశారు.

ఉద్యమాన్ని ద్వారంపూడికి తాకట్టు పెట్టిన ముద్రగడ తిరిగి డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు పెట్టిన ఉప్మాకు డబ్బులు పంపుతున్నామని జనసేన నేత పంతం నానాజీ మండిపడుతున్నారు.

గోదావరి జిల్లాల్లో ఊపందుకున్న ఈ మనియార్డర్ నిరసన ముద్రగడకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. మరి.. దీనిపై ఆయన ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.