Begin typing your search above and press return to search.

ట్వీట్లకు డబ్బులు.. అదెలానో చెప్పేసిన ఎలాన్ మస్క్

By:  Tupaki Desk   |   14 April 2023 8:00 PM GMT
ట్వీట్లకు డబ్బులు.. అదెలానో చెప్పేసిన ఎలాన్ మస్క్
X
ఇన్ స్టాలో పోస్టులకు డబ్బులు వస్తాయి. యూ ట్యూబ్ లో పోస్టు చేసిన వీడియోలకు యాడ్ రెవెన్యూ కింద బాగానే సంపాదించుకునే వీలుంది. ఇప్పుడు అదే బాటలోకి ట్విటర్ ను తీసుకొచ్చేశారు ఎలాన్ మస్క్. తాజాగా ట్విటర్ లో పోస్టు చేసే ట్వీట్లతో ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా మస్క్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఈ విధానం అమెరికాలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మిగిలిన వారికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్విటర్ తన చేతికి వచ్చిన తర్వాత నుంచి ఆ సోషల్ మీడియా మాధ్యమాన్ని పలు విధాలుగా మార్పులు చేస్తున్న ఆయన.. యూజర్లు తాము పోస్టు చేసిన కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలను ఆయన వెల్లడించారు.

ఆయనేం చెప్పారన్న విషయంలోకి వెళితే.. తమ కంటెంట్ ద్వారా యూజర్లు పొందే ఆదాయం నుంచి 12 నెలల పాటు ట్విటర్ ఏమీ తీసుకోదన్నారు. ఈ వ్యాఖ్యను చూస్తే.. భవిష్యత్తులో తాము సంపాదించే మొత్తం నుంచి ట్విటర్ కు కొంత మొత్తాన్ని షేర్ రూపంలో యూజర్లు ఇవ్వాల్సి వస్తుంది. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేని కైనా సరే సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చని.. సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.

ప్రస్తుతానికి అమెరికాలోనే ఉన్న ఈ ఆప్షన్.. త్వరలోనే అన్ని దేశాలకు విస్తరించనున్నారు. ట్విటర్ ద్వారా ఆర్జించిన మొత్తంలో ఐవోఎస్.. ఆండ్రాయిడ్ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు కింద వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాప్ లో ఇలాంటి పరిస్థితి ఉంటే.. వెబ్ లో అయితే.. 92 శాతం వరకుఆదాయం యూజర్లకే చెందుతుందని పేర్కొన్నారు. అదే రీతిలో కంటెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకు ట్విటర్ సహకారాన్ని అందిస్తుందని చెప్పారు.

అంతేకాదు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ కంటెంట్ తో సహా ట్విటర్ నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానంతో మరింతమందిని ట్విటర్ ఆకర్షిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ట్విటర్ ను విడిచి పెట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం సాయం చేస్తుందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ట్విటర్ ను ఆదాయ వనరుగా మారుస్తున్న ఎలాన్ మస్క్.. రానున్న రోజుల్లో దాని నుంచి తాను ఆదాయాన్ని సంపాదించాలన్న ఎత్తుగడలో ఉన్నట్లుగా చెప్పాలి.