Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఇవ్వకుండా చెన్నైలో ఇచ్చుడేంది?

By:  Tupaki Desk   |   10 Jan 2017 5:18 AM GMT
హైదరాబాద్ లో ఇవ్వకుండా చెన్నైలో ఇచ్చుడేంది?
X
కొన్ని నిర్ణయాలు ఎంత తల తిక్కగా ఉంటాయనటానికి తాజాగా ఉదంతమే నిదర్శనంగా చెప్పాలి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పాతనోట్లను మార్చుకోవటం కోసం రూపొందించిన నిర్ణయాలు కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి. ఎవరూ తయారు చేశారో కానీ.. నయా రూల్ హైదరాబాదీయులకు ఒళ్లు మండేలా చేయటమే కాదు.. సర్కారు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

డిసెంబరు 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. ప్రజలు తమ వద్దనున్న పాత నోట్లను మార్చుకోవటానికి వీలుగా డిసెంబరు 30 వరకూ అవకాశం ఇచ్చారు. గడువు లోపు మార్చుకోలేని వారు ఆర్ బీఐ కార్యాలయానికి వెళ్లి.. తగిన పత్రాలు చూపించి పాత నోట్లను మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. ఇందుకోసం తుది గడువు మార్చి 31గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.అయితే.. ఇక్కడ ఉన్న చిక్కేమిటంటే.. తమ దగ్గర ఉన్న పాత నోట్లను మార్చుకోవటానికి హైదరాబాద్ ఆర్ బీఐ కార్యాలయానికి వస్తున్న వారికి.. పాత నోట్లును మార్చుకోవటానికి చెన్నైఆర్ బీఐకి వెళ్లాలని చెప్పటం షాకింగ్ గా మారింది.

పాత నోట్ల మార్పిడి అవకాశం కేవలం ముంబయి.. చెన్నై.. ఢిల్లీ.. కోల్ కత.. నాగపూర్ ఆర్ బీఐ కార్యాలయాల్లో మాత్రమే వెసులుబాటు ఉందని.. అందుకే హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న చెన్నై వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. హైదరాబాద్ కు చెన్నైఎంత దూరమో.. ముంబయి కూడా ఇంచుమించు అంతే దూరమని చెప్పక తప్పదు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ ను వదిలేసి.. చెన్నైఆర్ బీఐని ఎంపిక చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్న వారికి ఎలాంటి సమాధానం రావటం లేదు.

ప్రభుత్వ నిర్ణయంతో పాత నోట్లు ఉన్న వారు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.10వేలు.. రూ.20వేల మొత్తంకోసం రెండు.. మూడు రోజులు కేటాయించి.. ఖర్చులు పెట్టుకొని చెన్నైకి వెళ్లి నోట్లు మార్చుకోవటం కన్నా.. వదిలేసుకోవటమే మిన్న అన్నట్లుగా పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. చెన్నై ఏమైనా హైదరాబాద్ పక్కనే ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 15 గంటల ప్రయాణం చేస్తే కానీ హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకోలేని పరిస్థితి. అక్కడికి వెళ్లినా.. వెంటనే నోట్ల మార్పిడికి అవకాశం ఉందో లేదో తెలీని పరిస్థితి. దేశంలోని ప్రముఖ నగరాల సరసన ఉన్న హైదరాబాద్ ను కాదని.. చెన్నై ఆర్ బీఐని ఎంపిక చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి.. ప్రజల కష్టాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. హైదరాబాద్ ఆర్ బీఐలో పాతనోట్లు చెల్లేలా నిర్ణయాన్ని మార్పు చేయాలని కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/