Begin typing your search above and press return to search.

పాయింటే మరి : మేమిద్దరం ఎందుకు మాట్లాడుకోకూడదు...?

By:  Tupaki Desk   |   23 May 2023 5:00 PM GMT
పాయింటే మరి :  మేమిద్దరం  ఎందుకు మాట్లాడుకోకూడదు...?
X
వాస్తవంగా ఆలోచిస్తే పాయింటే మరి. అసలు ప్రజాస్వామ్యంలో అలాగే ఉండాలి కదా. కానీ మధ్యలో వచ్చిన రాజకీయ పార్టీలు రాజకీయం అంతా జొప్పించి ఈ విధంగా కలుషితం చేశాయని అనుకోవాలి. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచినా ప్రజా ప్రతినిధి అయ్యాక వారు ప్రజల పక్షమే తప్ప రాజకీయ పక్షం కాదు అన్నదే ప్రజాస్వామ్య స్పూర్తి. ఈ విషయంలో విజయవాడ లోక్ సభ ఎంపీ పార్టీ బంధనాలు తెంచుకుని వైసీపీ ఎమ్మెల్యేను పొగుడుతున్నారు.

మరి వైసీపీ ఎమ్మెల్యే కూడా ఊరుకుంటారా. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈజ్ గ్రేట్ అంటున్నారు. ఆయన వేరే పార్టీ అయినంత మాత్రాన మాట్లాడుకోకూడదా అని లాజిక్ పాయింట్ ని కూడా తీశారు క్రిష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు. ప్రజలకు మంచి పనులు చేశారు కాబట్టే ఆయనను ఎంపీగా తనను ఎమ్మెల్యేగా జనాలే ఎన్నుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు.

నాకు నియోజకవరర్గం అభివృద్ధి ముఖ్యం. దాని కోసం ఎవరితోనైనా కలుస్తా, ఎవరితోనైనా వెళ్తాను అని మొండితోక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కేశినేని నానిని ఆయన చాలానే ప్రశంసించారు. మేమిద్దరం ప్రజా సేవ చేయాలనుకుంటున్నాం, అందుకే కలిశాం, ఒక్కటిగా ముందుకు పోతామని వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీగా చెప్పేశారు.

మొత్తానికి చూస్తూంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీలో తన వైఖరితో కలకలం సృష్టించారు. ఇపుడు తన వంతు అన్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యే కలి పుట్టించేలా ఉన్నారని అంటున్నారు. రాజకీయాలు బాగా చీలిపోయి ఉన్నాయి. అలాగే నాయకులు అంతా పార్టీలుగా విడిపోయి ఉన్నారు. ఇది దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహరం. ప్రత్యర్ధి పార్టీకి చెందిన ఎంపీని అయినా పిలవకుండా ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్న కాలమిది.

వారు వీరు అంటూ వేరుగా చూసుకున్న పరిస్థితులు నెలకొని ఉన్న నేపధ్యంలో నందిగామ ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ చెట్టాపట్టాల్ వేయడం అంటే ప్రధాన పార్టీలలో రాజకీయం రంగు రుచి మారుస్తున్నట్లే అంటున్నారు. కేశినేని నాని అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కినా లేకపోయినా ఓకే అంటున్నారు. మొండితోకకు టికెట్ కావాలా వద్దా అన్న చర్చ కూడా సాగుతోందిట. టీడీపీ ఎంపీతో కలిస్తే వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

అయితే కేశినేని మీద వైసీపీ కూడా ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. విజయవాడ ఎంపీగా మంచి పేరున్న నాని కనుక తమ వైపు వస్తే ఆయనని నిలబెట్టాలన్న ఆలోచనలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం సాగింది. ఇపుడు మొండితోక కామెంట్స్ ఏ రకమైన చర్చకు పరిణామాలకు దారి తీయనున్నాయో చూడాల్సి ఉంది.