Begin typing your search above and press return to search.

251 ఫోన్ పై 31 లాభం వస్తుందట

By:  Tupaki Desk   |   22 Feb 2016 7:53 AM GMT
251 ఫోన్ పై 31 లాభం వస్తుందట
X
రూ.251 కే లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విక్రయిస్తామంటూ సంచలనం సృష్టించిన ఫ్రీడమ్251 ఫోన్ల తయారీ సంస్థ అధినేత మోహిత్ గోయల్ పూర్తిగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇదంతా మోసమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రూ.251కే ఫోన్ విక్రయించినా తనకు ఒక్కో ఫోన్ పై రూ.31 లాభం వస్తుందని మోహిత్ చెబుతున్నారు. అంతేకాదు... తానేమీ జనం నుంచి డబ్బులు సేకరించి ఫోన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టే రకం కాదని వివరణ ఇచ్చుకున్నారు.

''రాత్రికి రాత్రే డబ్బులు పోగేసుకుని పరారయ్యే వ్యాపారాన్ని నేను చేపట్టలేదు.. స్మార్ట్‌ ఫోన్‌ ను 251 రూపాయిలకే విక్రయించడం వల్ల తమకు ఒక్కో ఫోన్‌ మీద 31 రూపాయిల లాభం వస్తుంది... 251 రూపాయిలకే స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తామంటూ నేనేమీ ప్రజలను తప్పుదోవ పట్టించడం లేదు'' అని ఆయన అన్నారు. ఈ అంశంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఆయన ఖండించారు. 251 రూపాయిలకే స్మార్ట్‌ ఫోన్‌ అంటూ గోయెల్‌ ప్రకటించిననాటినుంచి పోలీసులు, ఇన్‌ కంటాక్స్‌ అధికారులు ఆయన కార్యాలయాన్ని సందర్శించి పలు రకాలుగా ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో గోయెల్‌ మాట్లాడుతూ తాను చేసిన నేరమేమిటో, తననెందుకు వేటాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను కాని, తన కంపెనీ కాని ఇన్‌ కంటాక్స్‌ ఎగ్గొట్టామా...? తనపై ఏ పోలీస్‌ స్టేషన్‌ లోనైనా ఎఫ్‌ ఐఆర్‌ నమోదైందా? అని ప్రశ్నించారు.

మొదటి బ్యాచ్‌ లో 25 లక్షల యూనిట్లను ఆన్‌ లైన్‌ బుకింగ్‌ చేసుకున్నవారికి అందజేస్తామని, మరొక 25 లక్షల యూనిట్లను ఆఫ్‌ లైన్‌ లో విక్రయిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ తమ వెబ్‌సైట్‌లో 7 కోట్లమంది ఫోన్‌ కోసం రిజిష్టర్‌ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రజలు చెల్లించే సొమ్మును బ్యాంకునుంచి తాము ఇప్పుడే తీసుకోబోమని, వారికి ఫోన్లు అందజేసిన తరువాత ఆ డబ్బును తీసుకుంటామని ఆయన చెప్పారు. జూన్‌ 30వ తేదీనాటికి ఫోన్లను అందజేస్తామని మోహిత్ చెబుతున్నారు.