Begin typing your search above and press return to search.

బుద్దా..ఎన్నిక‌ల త‌ర్వాత మీరు మా ఇంటికి రావాలి

By:  Tupaki Desk   |   2 April 2019 8:49 AM GMT
బుద్దా..ఎన్నిక‌ల త‌ర్వాత మీరు మా ఇంటికి రావాలి
X
ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ర్సెస్ ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు ఎపిసోడ్ తెలిసిందే. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పెండింగ్ అంటూ ఏపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న ధ‌ర్నా నిర్వ‌హించటం.. ఈ విష‌య‌మై ఇరు వ‌ర్గాల మ‌ధ్య న‌డిచిన పంచాయితీ ఒక కొలిక్కి రాక‌ముందే.. మోహ‌న్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి సంచ‌ల‌నం సృష్టించారు.

పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న మోహ‌న్ బాబు విమ‌ర్శ‌లు పెను దుమారంగా మారుతున్నాయి. మీడియాలోనూ వీటికి అధిక ప్రాధాన్య‌త ల‌భిస్తోంది. త‌మ‌ను టార్గెట్ చేస్తూ మోహ‌న్ బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే ప‌నిలో భాగంగా ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌.. టీడీపీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ ప్రెస్ మీట్లు పెట్టి గ‌ట్టిగా మాట్లాడుతున్నారు. మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాకు ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మోహ‌న్ బాబు ఇవ్వ‌లేదంటూ ఆరోప‌ణ చేశారు.

ఇలా తెలుగు త‌మ్ముళ్లు వ‌ర్సెస్ మోహ‌న్ బాబు అన్న‌ట్లుగా సాగుతున్న మాట‌ల యుద్ధంగా స‌రికొత్త అంకం వ‌చ్చి చేరింది. త‌న‌ తండ్రి పై విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ నేత‌ల‌కు.. మ‌రి ముఖ్యంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న‌ను ఉద్దేశించి ట్విట్ట‌ర్ లో మంచు విష్ణు చేసిన పోస్ట్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక ర‌కంగా బుద్దాకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా ట్వీట్ ఉండ‌టం గ‌మ‌నార్హం.

వెంక‌న్న గారూ.. నోరు ఉంది క‌దాని ఊరికే పారేసుకోకండి. ఎన్నిక‌లు ఉండేది మ‌రో ప‌ది రోజులే.. ఆ త‌ర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేం మీ ఇంటికి రావాలి. ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకోవాలి.ఎన్నిక‌ల్లో మీరు విమ‌ర్శించొచ్చు..మేమూ మిమ్మ‌ల్ని విమ‌ర్శించొచ్చు. కానీ మ‌ర్యాద ఉండాలి. అన్నింటికి హ‌ద్దు ఉంటుంది. నెల రోజుల‌కు ముందు తిరుప‌తికి వ‌చ్చి మీరు మా ఇంట్లో కూర్చుని ఏం మాట్లాడారో మ‌ర్చిపోకండి అంటూ ట్వీట్ తో మండిప‌డ్డాడు. మ‌రి.. మంచు విష్ణు తాజా ట్వీట్ వార్నింగ్ కు బుద్దా ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.