రాజకీయాల విషయానికి వస్తే శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ ఉండరన్న నానుడి గురించి తెలిసిందే. ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారో.. ఎప్పుడు దూరమవుతారో చెప్పలేం. ఈ విషయం వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులకు తెలియందేమీ కాదు. అయినా సరే.. కొందరి విషయంలో మాత్రం వాళ్లు తీవ్ర వ్యతిరేకతతో ఉంటారు.
తమ పార్టీని, అందులోని నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించి, దూషించడమే కాక.. జనాల్లో ప్రతికూల అభిప్రాయం కలగడానికి కారణమైన కొందరు వ్యక్తుల విషయంలో మాత్రం వాళ్లు తీవ్ర వ్యతిరేక భావంతో ఉంటారు. అలాంటి వారిని శాశ్వతంగా దూరం పెట్టాలని కోరుకుంటారు. మంచు మోహన్ బాబు విషయంలో తెలుగుదేశంలో మెజారిటీ అభిప్రాయం ఇదే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఉండి.. ఆ తర్వాత తటస్థుడిగా మారిన మోహన్ బాబు.. గత ఎన్నికలకు ముందు పరిస్థితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపించడం చూసి ఆ పార్టీ సపోర్టర్‌గా మారారు.
జగన్‌తో వైకాపా కండువా కప్పించుకుని కొడుకు మంచు విష్ణుతో కలిసి వైకాపాకు మద్దతుగా ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు కక్ష కట్టి తన విద్యా నికేతన్‌కు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బిల్లులు రాకుండా అడ్డుకున్నారంటూ ఆయన తిరుపతిలో రోడ్డు మీద విద్యార్థులతో కలిసి ధర్నా చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
అది టీడీపీ ప్రభుత్వ ఇమేజీని బాగా డ్యామేజ్ చేసింది. కట్ చేస్తే.. ఎన్నికల్లో జగన్ పార్టీ విజయానంతరం మోహన్ బాబును పెద్దగా పట్టించుకున్నది లేదు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికల్లో మోహన్ బాబు చేసిన సాయానికి ప్రతిఫలంగా జగన్ ఏమీ చేయలేదు. పదవి ఇవ్వకపోగా కనీసం ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో మోహన్ బాబు అసంతృప్తి ఇటీవల స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన తన కూతురు మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం తెలుగుదేశం మద్దతుదారులకు అసలు నచ్చడం లేదు. మోహన్ బాబు తీరు తెలిసి కూడా ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు.. ఆయనతో కొన్ని గంటల పాటు ఎందుకు మాట్లాడారు అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
తాను తిరుపతిలో నిర్మించిన సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిసినట్లు మోహన్ బాబు చెప్పినప్పటికీ.. చంద్రబాబు ఆత్మీయంగా మోహన్ బాబుతో ఫొటోలు దిగడం, వీరి సమావేశం గురించి మీడియాలో ఒక చర్చ జరగడానికి అవకాశం ఇవ్వడం తెదేపా మద్దతుదారులకు అసలు నచ్చట్లేదు. ఏ స్థితిలోనూ మోహన్ బాబును నమ్మొద్దని, ఆయనకు మరో అవకాశం ఇవ్వొద్దని గట్టిగా గళం వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఐతే ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన వేరు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
మోహన్ బాబును కలిశారు అంటే ఆయన్ని పార్టీలో చేర్చుకుంటున్నట్లు, కలిసి పని చేయబోతున్నట్లు కాదని.. ఒకప్పుడు జగన్‌కు మద్దతిచ్చిన వాళ్లందరూ ఇప్పుడు అతడికి యాంటీగా తయారయ్యారని, అందరిలోనూ అసంతృప్తి ఉందని, జనాల మూడ్ కూడా ఇదే అని సంకేతాలు ఇవ్వడానికే మోహన్ బాబును ఆయన కలిసి ఉంటారని.. జగన్ అండ్ కోను కూడా ఇది టెన్షన్ పెడుతుందని.. ఇది రాజకీయంగా పార్టీకి లాభించే విషయమని ఆయన అంచనా వేస్తుండొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.