Begin typing your search above and press return to search.

మనిషి కాదు మానవ మృగం .. సైనేడ్‌ కిల్లర్ కి మరో జీవిత ఖైదు

By:  Tupaki Desk   |   27 Jun 2020 3:30 PM GMT
మనిషి కాదు మానవ మృగం .. సైనేడ్‌ కిల్లర్ కి మరో జీవిత ఖైదు
X
సైనైడ్ మోహన్.. 11 ఏళ్ల క్రితం ఈ పేరు ఓ సంచలనం. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మోసిన నేరస్థుడు, 20 మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం ఈ సైనైడ్‌ మోహన్. మోహన్ కి తాజాగా మరో కేసులో జీవిత ఖైదు విధించింది మంగళూరు న్యాయస్థానం. ఇప్పటికే పలు కేసుల్లో మోహన్ దోషిగా తేలాడు.

ఇక తాజాగా ఈ సీరియల్ కిల్లర్ కు మరోసారి శిక్ష పడింది. 2009లో ఓ కేరళ మహిళపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన 57 ఏళ్ల మోహన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సైనెడ్ కిల్లర్ గతంలో మరో 19 మంది మహిళలపై లైంగిక దాడి చేసిన ఘటనల్లో దోషిగా తేలాడు.

తాజా కేసు విషయానికి వస్తే మోహన్‌ కాసర్‌ గోడ్‌ కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి బెంగళూరు తీసుకెళ్లాడు. అక్కడ ఓ లాడ్జిలో బస చేశాడు. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భనిరోధక మాత్ర అంటూ ప్రాణాంతకమైన సైనేడ్ పూసిన మాత్రను మింగించడంతో ఆమె మరణించింది. మోహన్ ఇదే తరహాలో 20 సందర్భాల్లోనూ సైనేడ్‌ ప్రయోగించినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. విచారణ చేస్తుండగా అలా ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మండి అమ్మాయిలను మోసం చేసి చంపినట్టుగా మోహన్ అంగీకరించాడు. 89 ఆధారాలను పరిశీలించి, 46 మంది సాక్షులను విచారించిన అనంతరం 6వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి మోహన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

మోహన్ మృతురాలి వద్ద దొంగిలించిన ఆభరణాల్లో ఒకటి అతని రెండో భార్య వద్ద స్వాధీనంచేసుకున్నారు పోలీసులు. దానిని మృతురాలి తల్లికి అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇక మిగిలిన కేసులకు సంబంధించి ఇప్పటికే మోహన్‌కు వివిధ న్యాయస్థానాలు ఐదు మరణ శిక్షలు, జీవితకాల శిక్షలు విధించాయి. వీటిలో రెండు మరణ శిక్షలను జీవిత ఖైదుగా మార్చారు.