అగ్రనటుల హోదాలో ఉన్న వారు తమ హుందాతనాన్ని చాటుకోవాలి. ఇబ్బందికర సందర్భం వచ్చినపుడు సంయమనం ప్రదర్శించాలి. ఆ ఓర్పు, నేర్పూ లేకపోతే అనవసర అపోహలు ఏర్పడుతాయి. తాజాగా ఇలా ఊహించకుండా వచ్చిన ఓ సమస్యను తమ పరిణతితో పరిష్కరించారు తెలుగు ఇండస్ర్టీ దిగ్గజాలైన నందమూరి బాలకృష్ణ,మోహన్‌బాబు. తద్వారా అపోహలను ఎలా దూరం పెట్టవచ్చో తెలియజెప్పారు.
మోహన్ బాబుకు సంబంధించిన కాలేజీ వద్ద నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీ ఉండగా దాన్ని ఎవరో తొలగించారు. ఈ చర్య వెనుక మోహన్ బాబు ఉన్నారని పేర్కొంటూ బాలయ్య అభిమానులు పలువురు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ పై బాలయ్య తొందరపడి మోహన్ బాబుకు ఫోన్ చేయడం, ఫైరవ్వడం చేయకుండా సంయమనంతో వ్యవహరించారు. మరోవైపు ఈ విషయం మోహన్ బాబుకు తెలిసి బాలయ్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన కాలేజీ వద్దకు బాలకృష్ణ వచ్చారు. #ఫొటో మీరు తీసేయించి ఉండరు. ఎవరో కావాలనే ఇలా చేసి మీపై నాకు ఫిర్యాదు చేసి ఉంటారు. ఇవన్నీ ఏమీ పట్టించుకోకండి# అంటూ బాలయ్య వివరించారు.
హిందూపురంలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా మోహన్ బాబు ఈ సందర్భాన్ని గుర్తుచేశారు. తానేమీ బాలయ్యబాబు పొగడటం లేదని పేర్కొంటూ ఆయన వ్యక్తిత్వానికి ఇదీ నిదర్శనమని చెప్పారు. బాలకృష్ణకు పెద్ద సినిమాలు, కోట్ల రూపాయల పారితోషికం వస్తున్నప్పటికీ అభిమానుల కోసం లేపాక్షి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు గడ్డ సంస్కృతిని చాటేందుకు ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాలు బాలయ్య ఆలోచన తీరుకు అద్దంపడుతోందని మోహన్‌బాబు అన్నారు.