Begin typing your search above and press return to search.

మోహన్ బాబు డైలాగుల్లో ఏది ఎవరికి కౌంటర్?

By:  Tupaki Desk   |   11 Feb 2018 9:35 AM GMT
మోహన్ బాబు డైలాగుల్లో ఏది ఎవరికి కౌంటర్?
X
చాలాకాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ పోషించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం గాయత్రిలో డైలాగులతో తెలుగు పాలిటిక్సులో చర్చకు తెరతీశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంపీగానూ పనిచేసిన మోహన్ బాబు ఇప్పుడున్న తెలుగుదేశం నాయకుల తీరును తన డైలాగులతో ఏకిపడేశారు. గాయత్రి సినిమాలో ఆయన పలికిన డైలాగులు విన్నవారు అవన్నీ చంద్రబాబు - లోకేశ్ సహా టీడీపీ నేతలనుద్దేశించి అన్నవేనంటున్నారు. దీంతో ఇప్పుడా డైలాగులు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి.

రెండు రోజుల కిందట విడుదలైన గాయత్రిలో డ్యూయల్ రోల్ పోషించిన మోహన్ బాబు అందులో ఒక పాత్ర ద్వారా పవర్ ఫుల్ డైలాగులు పలికించారు. ”అటవీ శాఖ మంత్రికి జాతీయ పక్షి ఏంటో తెలియదు. క్రీడా శాఖ మంత్రికి ఒలంపిక్స్‌ లో ఎన్ని మెడల్స్‌ వచ్చాయో తెలియదు.. బీకాంలో ఫిజిక్స్‌ చదివానంటాడు ఒకడు. బీఎస్సీలో హెచ్‌ ఈసీ చదివానంటాడు మరొకడు. నేనిచ్చే పించన్ తీసుకుంటూ.. నేనేసిన రోడ్లపై నడుస్తూ ఓటు నాకెందుకు వేయరు అనే వాడు మరొకరు. భారతదేశ సార్వభౌమాధికారం అని పలకడం రాక సార్వ.. బౌబౌ అని అరిచేవారు ఇంకొందరు. వీరు మన మంత్రులు.. మేం ఓట్లేయాలి” అంటూ తన స్టైల్ లో మోహన్‌ బాబు చెప్పిన భారీ డైలాగ్ ఒకటి ఇందులో ఉంది. ఆ ఒక్క డైలాగులో ఆయన నలుగురైదుగురు నేతలపై పంచ్ విసిరారు.

అందులో... ‘‘నేనిచ్చే పించన్‌ తీసుకుంటూ.. నేనేసిన రోడ్లపై తిరుగుతూ ఓటు మాత్రం నాకెందుకు వేయరు” అన్న డైలాగ్‌ చంద్రబాబునుద్దేశించిందేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక బీకాం ఫిజిక్స్ డైలాగ్‌ ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ డైలాగుకు మూలం జలీల్ ఖాన్‌. ‘‘సార్వభౌమాధికారం అని పలకడం రాని వారు” అన్న డైలాగు ఏపీ మంత్రులు నారాయణ, కేఈ కృష్ణమూర్తి - పరిటాల సునీత - నిమ్మకాయల చినరాజప్ప - నారా లోకేష్ గురించే. వారంతా తమ ప్రమాణ స్వీకారం రోజు సార్వభౌమాధికారం అన్న పదం పలికేందుకు మూడు చెరువుల నీళ్లు తాగారు. ఇలా మోహన్ బాబు ఒక్క డైలాగుతో టీడీపీ నేతల అజ్ఞానం మొత్తం బయటపెట్టేశారు.