Begin typing your search above and press return to search.

మనోళ్లను వదిలేసి మరెవరికో సన్మానమా?

By:  Tupaki Desk   |   14 April 2016 5:23 AM GMT
మనోళ్లను వదిలేసి మరెవరికో సన్మానమా?
X
తెలుగువారి ఐకమత్యం గురించి చాలానే జోకులు ఉన్నాయి. ఒక పెట్టెలో కొన్ని కప్పలు ఉన్నాయని.. అవి పైకి రావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పైకి రాలేకపోతున్నాయని.. ఎందుకంటే కిందున్నకప్పలు వాటిని వెనక్కి లాగేస్తున్నాయని.. ఎక్కడివా కప్పలు అంటే.. తెలుగు ప్రాంతానికి చెందినవి అంటూ కొందరు జోకులేస్తుంటారు. ఈ ఒక్క జోకే కాదు.. ఏదైనా రంగానికి సంబంధించి విశేషంగా రాణించి.. అత్యున్నత గుర్తింపు పొందినా వారి గురించి ప్రస్తావిస్తూ.. ఇదే వ్యక్తి వేరే రాష్ట్రంలో పుట్టి ఉంటే వారికి మరింత గుర్తింపు వచ్చి ఉండేదని చెబుతారు. ఈ వాదన మీద ఏదైనా సందేహం ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని చూస్తే ఇదెంత నిజమన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఈ మధ్యన పద్మ పురస్కారాలకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పురస్కారాలు లభించాయి. వారిలో మీడియా మొఘల్ రామోజీరావు ఒకరైతే.. మరొకరు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. రామోజీకి మీడియా.. సేవా రంగానికి సంబంధించి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారు. పేరుకు మీడియా రంగమని చెప్పినా.. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషిని తక్కువ చేసి ఏమాత్రం చెప్పలేం. సినీ నిర్మాతగా.. స్టూడియో అధినేతగా ఆయన తెలుగు చలనచిత్రరంగంలో ఎంత కీలకభూమిక పోషిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక.. తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త హంగు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. వీరిద్దరికీ రెండు రోజుల క్రితమే వీటిని ప్రదానం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తెలుగు చిత్ర రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు అవార్డులు వస్తే.. ఇదే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సుబ్బిరామిరెడ్డి.. మోహన్ బాబు అండ్ కోలు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు సన్మానం చేయటం విశేషం. సాటి తెలుగువారికి అత్యున్నత పురస్కారాలు లభించినప్పుడు ఆనందంతో వారికి సన్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి.. ఒక బాలీవుడ్ నటికి పద్మశ్రీ వచ్చినందుకు సన్మానం చేయటం చూస్తే.. తెలుగోళ్లను తెలుగోళ్లు సన్మానించుకోరా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ప్రియాంకచోప్రాకు సన్మానం తప్పని చెప్పటం లేదు. కానీ.. ఇంట్లో వారిని వదిలేసి.. బయటోళ్లకు అంతేసి ప్రాధాన్యత ఏమిటి? పొరుగింటి మీద ఉండే ఆసక్తి.. ఇంట్లో వాళ్ల మీద ఉండదా..?