టీమిండియా ఈ నెల 21 నుంచి జరుగనున్న టి20 ప్రపంచ కప్ నకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ జట్టు ప్రాక్టీస్ గేమ్ లు ఆడుతోంది. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. ఇక ప్రపంచ కప్ లో ఈ నెల 23న తమ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఢీకొంటుంది. మరోవైపు జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. పేస్ బౌలింగ్ లో కీలకమైన, బ్యాట్ తోనూ రాణించగల దీపక్ చాహర్ ప్రపంచ కప్ నకు దూరమయ్యాడు.
ఇప్పటికే అత్యంత కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా ప్రపంచ కప్ ఆడడం లేదు. ఇప్పడు దీపక్ చాహర్ కూడా వారి సరసన చేరాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు కూడా దీపక్ దూరమయ్యాడు. టి20 ప్రపంచకప్ నాటికైనా కోలుకుంటాడని భావించినప్పటికీ.. ఆ అవకాశం లేదని స్పష్టమైంది. 'చాహర్ ఫిట్‌నెస్ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టినట్లుంది'అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. చాహర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.
మెయిన్ టీం లోకి వస్తాడనుకుంటే..
ప్రపంచ కప్ జట్టులో దీపక్ చాహర్ స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్నాడు. అయితే, బుమ్రా గాయపడడంతో చాహర్ కు ప్రధాన జట్టులో చోటు దొరుకుతుందని భావించారు. సీనియర్ పేసర్ మొహ్మద్ షమీని స్టాండ్ బైగా తీసుకుంటారని అనుకున్నారు. కానీ, దీపక్ మొత్తానికే దూరమయ్యాడు. ఇక బుమ్రా గాయంతో షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్ ల ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ ఇద్దామనుకుంటే అతడికి కొవిడ్ సోకింది. ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది.
లక్కీ సిరాజ్..
బుమ్రా, దీపక్ చాహర్ స్థానాల్లో మహమ్మద్ షమీతోపాటు హైదరాబాదీ పేసర్ సిరాజ్ టీమ్‌ఇండియాతో కలిసే అవకాశాలున్నాయి. ఆ ఇద్దరిలో ఎవరు ప్రధాన జట్టులోకి వస్తారనేది బీసీసీఐ చెప్పాల్సి ఉంది.మీడియం పేస్ తో పాటు బ్యాటింగ్ చేయగల శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఆస్ట్రేలియాకు పంపే అవకాశం కనిపిస్తోంది. కాగా, దీపక్ బదులు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన సిరాజ్ అద్భుతంగా రాణించాడు. అందుకే, బీసీసీఐ అతడిని ఆస్ట్రేలియాకు పంపించనుంది.
అవకాశాలు లేని స్థితి నుంచి
వాస్తవానికి పరుగులు భారీగా ఇస్తుండడంతో సిరాజ్ ను టి20 జట్టు సభ్యుడిగా తొలుత సెలక్టర్లు భావించలేదు. టెస్టులకు పరిమితం చేసి.. అవసరమైతే వన్డేలకు ఆడించాలనేది వారి ఉద్దేశంగా కనిపించింది. అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్ లో సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాక వికెట్లూ తీసి శభాష్ అనిపించుకున్నాడు. దీంతో ప్రపంచ కప్ జట్టుకు కనీసం స్టాండ్ బైగా నైనా పంపాల్సిన పరిస్థితి కల్పించాడు.
ఆసీస్ పిచ్ లు అతడికి అనుకూలం
సిరాజ్ తొలిసారి టీమిండియా తరఫున ఆడింది ఆస్ట్రేలియాలోనే. 2020 డిసెంబరులో జరిగిన ఆసీస్ పర్యటనలో అతడు తొలిసారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 జనవరిలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇదీ ఆస్ట్రేలియాలోనే జరిగింది. కాగా, కంగారూ నేలపైన ఉన్న పిచ్ లు సిరాజ్ బౌలింగ్ శైలికి అతికినట్లు సరిపోతాయి. రెండేళ్ల కిందటి టెస్టు సిరీస్ లో సీనియర్లు దూరమైనా టీమిండియా గెలిచిందంటే అందులో సిరాజ్ పాత్ర ఎంతో కీలకం. ఇక ఇప్పుడు ఆ అభిప్రాయంతో పాటు ఫామ్ రీత్యా కూడా సిరాజ్ ను ప్రపంచ కప్ నకు తీసుకెళ్లక తప్పలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.