Begin typing your search above and press return to search.

ఆడ‌లేక పాక్ మ‌ద్దెల‌ద‌రువు చూశారా...

By:  Tupaki Desk   |   8 July 2019 11:28 AM GMT
ఆడ‌లేక పాక్ మ‌ద్దెల‌ద‌రువు చూశారా...
X
ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్ చాలా పేలవ ప్రదర్శనతో లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టేసింది. పాకిస్తాన్ చివరి నుంచి రెండో ప్లేస్‌ లో నిలిచిన వెస్టిండిస్ లాంటి టీంతో జరిగిన మ్యాచ్ లో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ లో ఘోరంగా ఓడిన పాక్ నెట్ ర‌న్‌రేట్‌ లో బాగా వెనకబడి పోయింది. ఈ క్రమంలోనే బంగ్లాతో తమ చివరి మ్యాచ్లో గెలిచినా ఇంటిముఖం పట్టింది. అదే పాకిస్తాన్ వెస్టిండీస్ పై గెలిచి ఉంటే ఖ‌చ్చితంగా న్యూజిలాండ్ టీంను వెనక్కి నెట్టి సెమీఫైనల్‌కు వెళ్ళేది.

ఏదేమైనా పాక్ పేలవ ప్రదర్శన ప్రదర్శన తోనే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది అన్నది వాస్తవం. ఇదిలా ఉంటే ఆడలేక మద్దెల దరువు అన్నట్టు తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని పాక్ అభిమానులు... ఆ దేశ క్రికెట్ విశ్లేషకులు ఇప్పుడు భారత్ పై తన అక్కసు వెళ్లక్కుతున్నారు. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహమ్మద్ స‌మీని పక్కన పెట్ట‌డం వెన‌క అత‌డు ముస్లిం అవ్వ‌డ‌మే అని పాక్ క్రికెట్ విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

టీం ఇండియా పేస‌ర్ భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతంగా రాణించాడని, మూడు మ్యాచ్‌ ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడని.. అలాంటి ఫామ్‌ లో ఉన్న ఆట‌గాడిని కాద‌ని.. తిరిగి గాయం పాలైన భువ‌నేశ్వ‌ర్‌ కు ఎలా చోటు ఇస్తార‌ని... దీని వెన‌క బీజేపీ హ‌స్తం ఉంద‌ని వారు త‌లాతోకాలేని ఖండ‌న‌లు ఇస్తున్నారు. ఒక ముస్లిం ఎద‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే బీజేపీ ఇలా చేసింద‌ని... ఆ దేశ టాప్ ఛానెల్స్ డిబెట్‌ లో విశ్లేష‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ష‌మీకి పాక్ వాళ్లు మ‌తం అంట‌క‌ట్ట‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలో పాక్ మాజీ క్రికెట‌ర్ అబ్దుల్ ర‌జాక్ కూడా ఓ టీవీ చ‌ర్చ‌లో మాట్లాడుతూ ముస్లిం అయిన షమీ ఒక్కడే ఇంగ్లండ్‌పై పోరాడాడని, మిగతా బౌలర్లు ఏమాత్రం రాణించలేకపోయారని వ్యాఖ్యానించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభ‌వం ఉన్న ర‌జాక్ లాంటి వాళ్లు కూడా ష‌మీ ఇంగ్లండ్ మీద వికెట్లు తీయ‌డానికి..మ‌తానికి లింక్ పెట్టి మాట్లాడ‌డం వాళ్ల దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌నం.

ఇదే భార‌త క్రికెట్ జ‌ట్టులో ఎంతోమంది ముస్లింలు టాప్ ప్లేస్‌ లో ఉన్నారు. మున్సూర్ ఆలీఖాన్ ప‌టౌడీ- మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌- మహ్మ‌ద్ కైఫ్ లాంటి వాళ్లు ఎన్నో విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. అజారుద్దీన్ ఏకంగా మూడు ప్ర‌పంచ‌క‌ప్‌ ల‌కు భార‌త‌జ‌ట్టుకు కెప్టెన్‌ గా ఉన్నారు. భార‌త రాష్ట్ర‌ప‌తిగా కూడా అబ్దుల్ క‌లాం లాంటి ముస్లింలు ఎన్నిక‌య్యారు. ఇవ‌న్నీ తెలిసి కూడా పాక్ మేథావులు ఇంత చెత్త‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారంటే త‌మ జ‌ట్టు ఓట‌మి జీర్ణించుకోలేకే అన్న విమ‌ర్శ‌లు కూడా ఇంట‌ర్నేష‌న‌ల్‌గా వ‌స్తున్నాయి.