Begin typing your search above and press return to search.

టీమిండియా పేస్ బౌలర్ ఇంట విషాదం

By:  Tupaki Desk   |   21 Nov 2020 7:00 AM GMT
టీమిండియా పేస్ బౌలర్ ఇంట విషాదం
X
టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. క్రికెటర్ గానే కాదు.. వ్యక్తిగతంగా కూడా స్ఫూర్తివంతమైనోడు. ఆటో డ్రైవర్ గా తన తండ్రి గౌస్` కష్టానికి తగ్గట్లే.. తాను తీవ్రంగా శ్రమించి టీమిండియా జట్టులో సభ్యుడు స్థాయికి ఎదిగాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో కోల్ కతా జట్టుపై అద్భుత ప్రదర్శనను క్రికెట్ అభిమానులు ఏ మాత్రం మర్చిపోలేరు.

కోల్ కతా జట్టుపై 3/8 వికెట్లు తీసిన రోజునే సిరాజ్ తండ్రిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఆయన కోలుకున్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆయన ఈ మధ్యనే కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆయన మరణించారు. ప్రస్తుతం సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. తండ్రి మరణించిన సమయంలో సిరాజ్ ప్రాక్టీస్ లో ఉన్నాడు. ప్రాక్టీస్ ముగించిన వచ్చిన తర్వాత కెప్టెన్ కోహ్లితో పాటు.. కోచ్ రవిశాస్త్రి ఈ విషాద విషయాన్ని అతనికి చెప్పారు.

తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేని ఇబ్బందికర పరిస్థితుల్లో సిరాజ్ ఉన్నాడు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న క్వారంటైన్ నిబంధనల కారణంగా హైదరాబాద్ కు రాలేని పరిస్థితి. తండ్రి మరణంపై స్పందించిన సిరాజ్.. పెద్ద దిక్కును కోల్పోయానని.. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఆయన కోరికను తీర్చానని చెప్పారు. తాను క్రికెటర్ గా ఎదిగే సమయంలో తన తండ్రి ఎన్నికష్టాలు పడ్డారో తనకు తెలుసని.. తానున్న పరిస్థితిలో కోచ్.. కెప్టెన్ తనకు ధైర్యం చెప్పినట్లుగా వెల్లడించారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి మరెవరికి రాకూడదనే కోరుకుందాం.