Begin typing your search above and press return to search.

హెచ్ సీఏ కుర్చీపై అజార్...కల సాకారమైనట్టే కదా

By:  Tupaki Desk   |   27 Sep 2019 3:31 PM GMT
హెచ్ సీఏ కుర్చీపై అజార్...కల సాకారమైనట్టే కదా
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ గా కొలువుదీరాలన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కల ఎట్టకేలకు సాకారమైందనే చెప్పాలి. క్రికెటర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజార్... ఇటు బ్యాటింగ్ తోనే కాకుండా అటు ఫీల్డింగ్ లోనూ సత్తా చాటిన వైనం మనందరికీ తెలిసిందే. అజార్ త్రో వేశాడంటే... ఎటు నుంచి ఎటు విసిరినా కూడా బాల్ స్టంప్స్ ను గిరాటేయాల్సిందే. అలా ఎందరినో అవుట్ చేసిన అజార్... టీమిండియా కెప్టెన్ గానూ తనదైన ముద్ర వేశాడు. సెల్ఫ్ రికార్డులను పక్కనపెట్టేసి... జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడిన క్రికెటర్ గానూ అజార్ కు మంచి పేరే ఉంది.

క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఎందుకనో గానీ... ఆటకు సంబంధించిన వ్యవహారాలకు చాలా కాలం పాటు అజార్ దూరంగానే ఉంటూ వచ్చారు. సినీ నటి సంగీతా బిజ్లానీతో రెండో వివాహం, దాని వెనుక తలెత్తిన వివాదాలు, ఆ తర్వాత బైక్ రేసుల్లో కొడుకు అకాల మరణంతో అజార్ చాలా కాలం పాటు అసలు ఆట వైపు దృష్టి సారించలేదనే చెప్పాలి. ఈ వరుస షాకుల నుంచి తేరుకునేందుకు అజార్ కు చాలా కాలమే పట్టినట్టుగా చెప్పాలి. ఇటీవలే ఆ షాకులన్నింటి నుంచి బయటపడ్డ అజార్... మళ్లీ ఆట వైపు చూశారు. ఎలాగూ క్రీడాకారుడిగా రిటైర్ మెంట్ ఇచ్చిన అజార్ ఆటగాడిగా మారలేడు కదా. అయితేనేం... క్రికెట్ వ్యవహారాలకు సంబంధించి చాలా వ్యవహారమే నడుస్తోంది కదా. ఆ దిశగానే దృష్టి సారించిన అజార్... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఎన్నికలపై దృష్టి సారించారు. అయితే అప్పటికే హెచ్ సీఏ కుర్చీపై పాతుకుపోయిన మాజీ ఎంపీ వివేక్... అజార్ ను అటు దిశగా రానివ్వలేదు.

దీంతో కాస్తంత మనసు నొచ్చుకున్న అజార్... ఎలాగైనా ఆ హెచ్ సీఏ సీటును దక్కించుకోవాల్సిందేనన్న కసితో కదిలారు. అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనదైన శైలిలో చక్రం తిప్పారు. తనను హెచ్ సీఏకు దూరంగా పెట్టిన వివేక్ కు ఘోర పరాభవం దక్కడంతో పాటుగా అసలు నామినేషనే తిరస్కరణకు గురి కాగా... అజార్ కల సాకారమయ్యే అవకాశాలు స్పష్టంగానే కనిపించాయి. ఈ క్రమంలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ పదవికి అజార్ నామినేషన్ వేశారు. ఈ పదవి కోసం అజారుద్దీన్ సహా ప్రకాశ్ చంద్ జైన్ - దిలీప్ కుమార్ పోటీ పడ్డారు. మొత్తం ఓట్లు 227 కాగా - 223 మాత్రమే పోలయ్యాయి. వీటిలో అజారుద్దీన్ కు 147 - ప్రకాశ్ జైన్ కు 73 - దిలీప్ కుమార్ కు 3 ఓట్లు లభించాయి. దీంతో హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా అజార్ ఎన్నికైనట్లు హెచ్ సీఏ నుంచి ప్రకటన విడుదలైపోయింది. మొత్తంగా చాలా కాలం పాటు వేచి చూసినా... అజార్ తన కలను సాకారం చేసుకున్నారన్న మాట.