Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను దెబ్బేయటానికి కేఏ పాల్ ను సెలెక్టు చేసుకున్న మోడీషా?

By:  Tupaki Desk   |   23 Jun 2022 5:29 AM GMT
కేసీఆర్ ను దెబ్బేయటానికి కేఏ పాల్ ను సెలెక్టు చేసుకున్న మోడీషా?
X
కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కు ఒక ప్రశ్న ఎదురైంది. అదేమంటే.. మీకు రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అన్న మాటకు కేటీఆర్ నోటి నుంచి వచ్చిన సమాధానం విన్న వారంతా నవ్వుకోవటంతో పాటు.. కేటీఆర్ కు గోదారోళ్ల ఎటకారం బాగా వచ్చేసిందన్న మాట సరదాగా అనుకున్నోళ్లు చాలామందే ఉన్నారు. దీనికి కారణం ఆయన నోటి నుంచి వచ్చిన సమాధానమే. తెలంగాణలో తమకు పోటీ ఉన్నది కేఏపాల్ పార్టీ మాత్రమేనని తేల్చిన ఆయన సమాధానం విన్నోళ్లంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి.

ఏ ముహుర్తంలో కేఏ పాల్ గురించి మంత్రి కేటీఆర్ సదరు వ్యాఖ్యలు చేశారో కానీ.. ఆ మాటల్ని నిజం చేయాలన్నట్లుగా మోడీషాలు డిసైడ్ అయ్యారా? అన్న సందేహం ఇప్పుడు కలుగక మానదు. గడిచిన 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణం. అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో తెలంగాణ ప్రాంతానికి చెందిన శంక్రరావు అనే సీనియర్ నేత ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదు చేయటం.. ఆ తర్వాతి కాలంలో ఆయన జైలకు వెళ్లాల్సి రావటం తెలిసిందే.

అప్పట్లో శంక్రరావు ఇచ్చిన ఫిర్యాదును చాలామంది లైట్ తీసుకున్నారు. తాడు పామైనట్లుగా.. అతని ఫిర్యాదు చాలానే రాజకీయ పరిణామాలకు కేంద్రంగా మారింది. తన మాటలతో కేఏ పాల్ ను పూచిక పుల్లను తీసేసినట్లుగా తీసే కేటీఆర్ అండ్ కోకు భారీ షాకిచ్చేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని పనిని షురూ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు రూ.9లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపించారు. అంతేకాదు.. తెలంగాణతో పాటు సింగపూర్.. దుబాయ్.. అమెరికాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు అనేక ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో బుధవారం సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ ను కలిసిన ఆయన.. అందుకు తగ్గ కంప్లైంట్ ఇచ్చారు.

దీనికి సంబంధించిన విచారణ వెంటనే మొదలు పెట్టాలని కోరినట్లుగా చెప్పారు.ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి తాను చూడలేదన్న పాల్.. సీఎం కేసీఆర్ మీద అవినీతి విచారణ జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది మొదలు కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావు.. సంతోష్.. ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. ప్రాజెక్టు బడ్జెట్ అంచనా రూ.1.05లక్షల కోట్లు కాగా.. రూ.35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి భారీగా దోచుకున్నారన్నారు.

కేసీఆర్ కుటుంబ అవినీతి మీద పక్కా విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. కేఏ పాల్ ఆరోపణలు సంచలనంగా మారటమే కాదు.. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ ను కలిసి కేసీఆర్ మీద కంప్లైంట్ చేశారు. చూస్తుంటే.. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా తిరుగులేని కేసీఆర్ ఫ్యామిలీకి కేఏ పాల్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ కాచుకొని ఉందా? అన్న కొత్త సందేహం కలిగేలా తాజా పరిణామం చోటు చేసుకుందన్న అభిప్రాయం కలుగక మానదు.