Begin typing your search above and press return to search.

మరో సంచలనం..మందిరంపై లోక్ సభలో మోడీ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   5 Feb 2020 7:20 AM GMT
మరో సంచలనం..మందిరంపై లోక్ సభలో మోడీ కీలక ప్రకటన
X
ప్రధానమంత్రి మోడీ కీలక ప్రకటన చేశారు. ఎవరేం అనుకున్నా.. తాము అనుకున్న ఎజెండా ప్రకారం ముందుకు వెళ్లేందుకే తయారుగా ఉన్నామన్న విషయాన్ని తన తాజా ప్రకటన తో మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన నిరసనలు చల్లారనప్పటికీ.. మరో కీలక అంశానికి సంబంధించిన ప్రకటన చేసి రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పాలి.

రామ జన్మభూమి లో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి కేంద్రమంత్రి వర్గం ఇప్పటికే ఆమోదముద్ర వేసిందన్న విషయాన్ని వెల్లడించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా లోక్ సభ కు వచ్చిన ప్రధాని.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు.

ఆయోధ్యలోని మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలన్న ఆయన.. రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దేశ ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఇందుకు 130 కోట్ల దేశ ప్రజలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సున్నీ వక్ఫ్ బోర్డు కు ఐదు ఎకరాల భూమి ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు.

మందిరం నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటం.. వివాదాస్పదం గా మారిన 2.77 ఎకరాల భూమిని రాంలల్లా కు చెందుతుందని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అయోధ్య లోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పు ఇవ్వటం తెలిసిందే.