Begin typing your search above and press return to search.

నాడు నేల మీద....విధిని నమ్మాల్సిందే మోడీజీ...!

By:  Tupaki Desk   |   28 Feb 2023 8:00 AM GMT
నాడు నేల మీద....విధిని నమ్మాల్సిందే మోడీజీ...!
X
నరేంద్ర మోడీ. ఈ దేశానికి తొమ్మిదేళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. మరో తడవ అవకాశం వచ్చేలాగానే ఉంది. అపుడు ఈ దేశాన్ని ఏలిన అత్యంత శక్తివంతమైన నాయకురాలు ఇందిరాగాంధీకి సరిసమానమైన రికార్డుని సాధిస్తారు. పైగా కాంగ్రేసేతర ప్రధానులలో ఇప్పట్లో ఎవరూ సాధించని ఘనమైన రికార్డుని సాధిస్తారు. ఇది కేవలం దేశం వరకూ చూస్తే జరిగేది.

అయితే అంతర్జాతీయంగా చూస్తే మోడీ గొప్పతనం రోజు రోజుకూ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ఆయన ఎక్కడ ఉన్నా వెతికి వెళ్ళి మరీ షేక్ హ్యాండ్ ఇస్తూంటే యుద్ధోన్మాదంతో రగిలిపోతూ ప్రపంచానికే అరవీర భయంకరుడిగా కనిపించిన రష్యా అధినేత పుతిన్ సైతం మోడీ కాల్ ని రిసీవ్ చేసుకుని ఆయన చెప్పిన మాటలను కూల్ గా వినడం. ఇది కదా మోడీ పవర్ అంటే ఏంటో చెప్పడానికి.

టర్కీ భారత్ పట్ల ద్వేష భావం పెంచుకుని కాశ్మీర్ ఇష్యూ సహా అన్నింటిలోనూ పాకిస్థాన్ కి మద్దతూ ఇస్తూ వచ్చింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అలాంటి టర్కీ పెను భూకంపంతో చిగురుటాకులా విలవిలలాడిపోతే తొలిసాయం అందించిన దేశంగా భారత్ ఉంది. దాని వెనక మోడీ ఉన్నారు. దోస్త్ అంటే భారత్ కదా అని టర్కీ కొత్త రాగం అందుకుంది అంటే మోడీని ఏ విధంగా చూడాలని అన్న వారూ ఉన్నారు.

దాయాది పాకిస్తాన్ భారత్ ని ఎపుడూ తెగడమే తప్ప పొగడదు. అలాంటి పాకిస్థాన్ లో ఇపుడు చిత్రంగా మోడీ రాగాలు వినిపిస్తున్నాయి. మాకూ మోడీ లాంటి నేత ఉంటే చాలు ఆయన్ని మాకు పంపించు దేవుడా అని భారీ ఆర్థిక సంక్షోభం చూస్తున్న పాక్ ప్రజలు అంటున్నారు. మోడీ గొప్పోడు అని ఆ దేశాన్ని ఏలిన ఇమ్రాన్ ఖాన్ లాంటి వారూ అంటున్నారు. ఇలా ఏడున్నర పదుల ప్రస్థానంలో భారత్ ని ఏ రోజూ కీర్తించని పాక్ ఇలా మారిందంటే మోడీ గ్రేట్ అనాల్సిందే కదా.

బీజేపీలో ఆయనే సుప్రీం. దేశ రాజకీయాల్లో ఆయన వ్యూహాలే కరెక్ట్ అన్న వారూ ఉన్నారు. ఒకనాటి కాంగ్రెస్ స్థానాన్ని ఈ రోజు బీజేపీ ఆక్రమించి విపక్షాలను కకావికలం చేస్తున్న వేళ మోడీ 2024లో ఎలా ముందుకు వస్తారో అన్న కంగారు ప్రతిపక్ష శిబిరాన్ని ఆవరించిన వేళ మోడీ ఫ్లాష్ బ్యాక్ ఆయనకే కాదు అందరికీ గుర్తుంది. నిజానికి తన పునాదులు తాను వచ్చిన ప్లేస్ ని ఎపుడూ మోడీ గుర్తుంచుకోవడం వల్లనే ఈ రోజు ఇలా ఉన్నారని అనే వారూ ఉన్నారు.

అయితే నిజంగా నేల మీద నుంచి పుష్పించిన కమలమే అని చెప్పాలి. ఆయన గుజరాత్ లోని ఒక పేద కుటుంబంలో పుట్టారు. టీ దుకాణం నడుపుతూ ఉండేవారు. ఆ విషయాన్ని ఆయన ఎన్నో సార్లు చెప్పుకున్నారు. ఆయన మొదట ఆరెస్సెస్ లో పనిచేశారు. తరువాత బీజేపీలోకి వచ్చారు. గుజరాత్ కేంద్రంగా ఆయన 1990లలో పనిచేస్తూ యూత్ వింగ్ లో కీలకం అయ్యారు. అప్పట్లో అద్వానీ రధ యాత్ర జరిగితే మోడీ ఆయన వెనకే ఉన్నారు.

ఆ తరువాత కాలంలో గుజరాత్ లో కాంగ్రెస్ కోటను కూల్చడంలో మోడీ వ్యూహాలు పనికివచ్చాయి. బీజేపీ కురు వృద్ధ నేత కేశూ భాయి పటేల్ ని 1995లో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడంలో మోడీ పాత్ర కూడా చాలా ఉంది. అంటారు. నాడు ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ప్రమాణ స్వీకారం జరిగితే బీజేపీ యోధానుయోధులు ఆ సభకు వచ్చారు. అద్వానీ కేశూభాయి పటేల్ కుర్చీలో ఉంటే వారి ముందు నేల మీద కూర్చున్న మోడీ పాత చిత్రం ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యువకుడిగా ఉన్న మోడీ నిర్మలంగా ఉన్నారు. ఎదురుగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆయన వీక్షిస్తున్నారు. ఆయనను నాడు అలా చూసిన వారు ఈ దేశానికి రెండు సార్లు పూర్తి మెజారిటీతో బలమైన ప్రధాని అవుతారని, ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటారు అని అసలు ఊహించరు. అంతే కాదు మోడీ అన్న రెండు అక్షరాలనే దేశం పదే పదే జపిస్తుంది అని కూడా అనుకోని ఉండరు.

మరి దీని విధి అంటే ఎవరైనా నమ్ముతారో లేదో కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే కళ్లెదుట మోడీ కనిపిస్తున్నారు కాబట్టి ఆనాటి సాధారణ మోడీని చూసిన దానికి సాక్ష్యంగా రాజకీయ భీష్ముడు ఎల్కే అద్వానీ కూడా ఉన్నారు. మోడీ ఎంతో కష్టపడ్డారు. కానీ అదృష్టం కూడా తోడు అయింది. దాన్నే విధి అని చెప్పుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.