Begin typing your search above and press return to search.

మోదీకి... ప్ర‌జ‌లే ప్ర‌త్య‌ర్థులా?

By:  Tupaki Desk   |   25 Nov 2017 9:34 AM GMT
మోదీకి... ప్ర‌జ‌లే ప్ర‌త్య‌ర్థులా?
X
గ‌డ‌చిన ఎన్నిక‌లు జ‌రిగి ఇప్ప‌టికే మూడున్న‌రేళ్లు దాటిపోయింది. దాదాపుగా మూడు ద‌శాబ్దాల త‌ర్వాత దేశంలో సుస్థిర ప్ర‌భుత్వాన్ని న‌రేంద్ర మోదీ ఏర్పాటు చేశారు. అప్ప‌టికే ప‌దేళ్ల పాటు పాల‌న సాగించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డ‌మే కాకుండా... ఏకంగా ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌కుండా ఘాటు స‌మాధాన‌మే చెప్పారు. వెర‌సి ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగించే పార్టీల‌కు తాము త‌గిన గుణ‌పాఠం చెప్ప‌గ‌ల‌మ‌ని కూడా ప్ర‌జ‌లు ఆ తీర్పుతో చెప్పిన‌ట్లైంది. గ‌తంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా కూడా ప్ర‌జ‌లు ఈ త‌ర‌హా తీర్పుల‌నే ఇస్తున్న విష‌యం కొత్తేమీ కాదు. కాంగ్రెస్ పాల‌న‌తో విసుగు చెందిన ప్ర‌జ‌లు గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైన తీర్పును ఇచ్చి న‌రేంద్ర మోదీ చేతికి అధికార దండ‌మిచ్చారు. అవినీతిని అంత‌మొందిస్తాన‌ని, విదేశాల్లో మూలుగుతున్న న‌ల్ల ధ‌నాన్ని దేశానికి తిరిగి తీసుకువ‌స్తాన‌ని మోదీ చెప్పిన మాట‌లే నాటి ప్ర‌జ‌ల తీర్పున‌కు కార‌ణంగా నిలిచాయ‌ని చెప్పాలి.

నిజంగానే బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో అధికారం చేప‌ట్టిన న‌రేంద్ర మోదీ... తాను ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేశారా? అంటే కొంత‌మేర చేశార‌నే చెప్పాలి. తొలుత త‌న జనాక‌ర్ష‌క విధానాల‌తో తొలి రెండేళ్లు పాల‌న సాగించిన మోదీ... న‌ల్ల‌ధ‌నంపై స‌మ‌రమంటూ... గ‌తేడాది ఇదే నెల‌లో ఉరుము లేని పిడుగులా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌క‌ట‌న చేసిన మోదీ... ఆ ప్ర‌క‌ట‌న‌ను అదే రాత్రి 12 గంబ‌ల‌కే అమ‌ల్లోకి తెచ్చారు. అప్ప‌టిదాకా మోదీ నిర్ణ‌యాల‌ను నెత్తిన పెట్టుకుని త‌మ‌కు తాముగా ప్ర‌చారం చేసిన ప్ర‌జ‌లు పెద్ద నోట్ల ర‌ద్దును మాత్రం స్వీక‌రించ‌లేక‌పోయారు. న‌ల్ల‌ధ‌నాన్ని రూపుమాపేందుకు అంటూ మోదీ చెప్పిన మాట‌లు విన‌డానికి బాగానే ఉన్నా... పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అవ‌స‌ర‌మైన మేర క‌రెన్సీ అందుబాబులో లేకుండా పోవ‌డంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డ్డారు. నెల‌ల త‌ర‌బ‌డి బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద క‌రెన్సీ నోట్ల కోసం గంట‌ల త‌ర‌బ‌డి బారులు తీరాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ప‌లువురు అభాగ్యులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

నోట్ల ఇబ్బందులు తీరేలోగానే జీఎస్టీ పేరిట మోదీ స‌ర్కారు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ప‌న్నుల విధానం... ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురి చేసింద‌ని చెప్పాలి. అస‌లు జీఎస్టీ వ‌ల్ల త‌మ‌కు లాభం జ‌రుగుతుందొ, లేదంటే న‌ష్ట‌మే జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న‌ది జ‌నం మాట‌గా వినిపించింది. ఇదే అద‌నుగా వ్యాపారుల చేతివాటం బ‌య‌ట‌కు రావడంతో జీఎస్టీపైనా ప్ర‌జ‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మొత్తంగా ఈ రెండు కీల‌క నిర్ణ‌యాలు మోదీని ప్ర‌జ‌లకు శత్రువును చేశాయ‌నే చెప్పాలి. ముంద‌స్తు క‌స‌ర‌త్తు లేకుండా అమ‌ల్లోకి వ‌చ్చేసిన ఈ రెండు నిర్ణ‌యాలతో తామెంత ఇబ్బందులు ప‌డ్డామ‌న్న విష‌యం మోదీకి అర్ధం కావ‌డం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తామ‌ని కూడా కొంద‌రు వ్యాఖ్యానిస్తుండ‌టం గ‌మ‌నార్హం. జ‌నం నుంచి వినిపిస్తున్న ఈ మాట‌నే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బ‌య‌ట‌పెట్టేశారు కూడా. నేటి ఉద‌యం ఢిల్లీలో జ‌రిగిన ఓ పుస్తకావిష్క‌ర‌ణ స‌భ‌లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా మాట్లాడిన కేజ్రీ... వ‌చ్చే ఎన్నికల్లో మోదీకి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్యే పోటీ జ‌రుగుతుంద‌ని చెప్పారు. కేజ్రీలాంటి మాజీ సివిల్ స‌ర్వెంట్ నోట నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు నిజంగానే బీజేపీకి డేంజ‌ర్ బెల్స్ మోగించేవేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.