Begin typing your search above and press return to search.

మోదీ వెంట గాంధీ మనమరాలు

By:  Tupaki Desk   |   10 July 2016 10:24 AM IST
మోదీ వెంట గాంధీ మనమరాలు
X
ప్రధాని మోడీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. తరచూ విదేశీ పర్యటనలు చేసే ప్రధాని టూర్లకు భిన్నంగా దక్షిణాఫ్రికా టూర్ సాగింది. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలతో పాటు.. జాతిపిత మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన మూడు ప్రాంతాల్లోఆయన పర్యటించారు. తన పర్యటనలో భాగంగా చరిత్మాత్మక రైలు ప్రయాణం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ వెంట గాంధీ మనమరాలు ఉండటంగా చెప్పొచ్చు.

గాంధీని మహాత్ముడిగా మార్చటం.. అహింసను ఆయుధంగా చేసుకొని పోరాడే తత్వాన్ని గాంధీలో నుంచి బయటకు తీసిన ట్రైన్ జర్నీని మోడీ చేశారు. 1893లో గాంధీ పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్ మారిట్జ్ బర్గ్ స్టేషన్ కు ప్రయాణం చేశారు. ఒకటో క్లాస్ రైలు టికెట్ తో రైలు ఎక్కినప్పటికి.. జాతి వివక్ష కారణంగా మూడో క్లాసులో ప్రయాణం చేయాలని అధికారుల ఆదేశాల్ని గాంధీ పట్టించుకోకపోవటం.. తమ మాట వినని ఆయన్ను రైల్లో నుంచి కింద పడేయటం తెలిసిందే. ఈ ఘటనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీని మహాత్మా గాంధీగా మార్చింది.

ఈ చరిత్మక సన్నివేశానికి సాక్షి అయిన ట్రైన్లో.. అదే మార్గంలో తాజాగా ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాయ పర్యటన తనకు తీర్థ యాత్ర లాంటిదని.. భారత చరిత్రకు.. గాంధీ జీవితానికి సంబంధించి మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో తానుపర్యటించిన విషయాన్ని వెల్లడించారు. ‘‘ఇది నా అదృష్టం’’ అంటూ పేర్కొన్నారు. గాంధీని రైల్లో నుంచి తోసేసిన పీటర్ మార్టిజ్ బర్గ్ స్టేషన్ ను సందర్శించిన ఆయన.. అక్కడే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం రాజకీయ కార్యకలాపాల కోసం గాంధీ వినియోగించిన ఫీనిక్స్ సెటిల్ మెంట్ ను సందర్శించారు. దక్షిణాఫ్రికాలో తన టూర్ ను ముగించుకున్న మోడీ.. టాంజానియాకు పయనమయ్యారు.