Begin typing your search above and press return to search.

మోడీకి పెగాసస్ మంట‌

By:  Tupaki Desk   |   11 Aug 2021 4:30 PM GMT
మోడీకి పెగాసస్ మంట‌
X
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌భ మాములూగా లేదు.. దేశ‌వ్యాప్తంగా ఆయ‌న హ‌వానే న‌డుస్తోంద‌ని రెండేళ్ల‌కు ముందు 2019లో రెండోసారి బీజేపీ అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంతో ఆయ‌న‌దే ప్ర‌ధాన పాత్ర అని.. ఇలా ఎన్నో వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ ఇప్పుడా ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. దేశాన్ని ముంచెత్తి విలయతాండ‌వం చేసిన క‌రోనా మహ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ఈ క్లిష్ట స‌మ‌యంలోనే ఆకాశానికి అంటుతోన్న పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్ర‌భుత్వానికి చేత కావ‌ట్లేద‌ని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. దీంతో దేశంలో మోడీ ప్ర‌భ త‌గ్గుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక ఇప్పుడేమో పెగాస‌స్ వ్య‌వ‌హారం ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింది

పెగాస‌స్ సాఫ్ట్‌వేర్ ఉప‌యోగించి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో పాటు దేశంలోని కొన్ని వందల మంది ప్ర‌ముఖుల మొబైల్ ఫోన్ల‌ను మోడీ అధికారంలోని కేంద్ర ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేయించింద‌నే ఆరోప‌ణ‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం పార్ల‌మెంట్‌ను కుదిపేస్తోంది. గ‌త నెల 19న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి పెగాస‌స్‌పై గొడ‌వ సాగుతూనే ఉంది. త‌మ ఆరోప‌ణ‌ల‌పై మోడీ స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నా ప్ర‌ధాని మాత్రం అస‌లు స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటికి మ‌రింత బ‌లం చేకూర్చే దిశ‌గా పెగాస‌స్‌తో ర‌క్ష‌ణ శాఖ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేద‌ని ర‌క్ష‌ణ‌శాఖ స‌హాయ మంత్రి అజ‌య్ భ‌ట్‌తో చెప్పించ‌డం గొడ‌వ‌ను మ‌రింత ముదిరేలా చేస్తోంది.

పెగాస‌స్ వ్య‌వ‌హారం ఇప్ప‌టికీ పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌ను కుదిపేస్తోంది. దీనిపై మోడీ మాత్రం ఎందుకు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్లగా ప్ర‌శ్న‌గా మారింది. పైగా ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు పెగాస‌స్‌తో ఒప్పందం లేద‌ని ర‌క్ష‌ణ శాఖ ఇప్పుడెందుకు ప్ర‌క‌టించింది? ఇన్ని రోజుల స‌మ‌యం ఎందుకు తీసుకుందో అర్థం కావ‌ట్లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పైగా ఇది ర‌క్ష‌ణ శాఖ ఒక్క విష‌య‌మే కాదు. పెగాస‌స్‌తో కేంద్ర హోం శాఖ‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌లు కూడా ఒప్పందాలు చేసుకున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఈ ఆరోప‌ణ‌ల‌పై మోడీనే స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీస్తున్నాయి. మ‌రోవైపు వీదేశీ మీడియా కూడా పెగాస‌స్‌తో భార‌త్‌లో ఫోన్లు ట్యాప్ చేశార‌ని వ‌రుస‌గా క‌థ‌నాలు అందిస్తున్నాయి. అయిన‌ప్పటికీ మోడీ నోరు తెర‌వ‌క‌పోవ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.