Begin typing your search above and press return to search.

గాంధీ ఇంట్లో అలా.. మోడీ ఇంట్లో ఇలా..

By:  Tupaki Desk   |   16 May 2016 7:02 AM GMT
గాంధీ ఇంట్లో అలా.. మోడీ ఇంట్లో ఇలా..
X
ఒకట్రెండు రోజుల తేడాతో చోటు చేసుకున్న రెండు పరిణామాలు దేశ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఒకే అంశానికి సంబంధించిన రెండు విరుద్ధ కోణాల్లో చోటు చేసుకున్న అంశాలుగా వాటిని చెప్పుకోవాలి. భారతజాతి మొత్తాన్ని ఏకం చేసిన జాతిపిత మహాత్మగాంధీ సొంత మనమడు ఈ రోజు ఎవరికి కాకుండా పోయి.. తన భార్యతో కలిసి ఓల్డేజ్ హోమ్ లో బతుకునీడుస్తున్న వార్త ఒకటి మీడియాలో కనిపించగానే చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరి నోటి నుంచి అయ్యో అనిపించింది. ఇక.. ఢిల్లీ సర్కారు మొదలు.. కేంద్రప్రభుత్వం కూడా ఈ అంశం మీద స్పందించింది.

గాంధీ మనమడికి ఎంత కష్టం వచ్చిందో అని దేశ ప్రజలు అనుకునే వేళ.. మోడీ వ్యవహరించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ తల్లికి బిడ్డనే అన్న విషయాన్ని తెలియజేసేలా.. ఆయన తన తల్లిని వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టుకొని తన అధికార నివాసాన్ని చూపించటం.. ఆమె చేతేలతో మంచినీళ్లు తాగటం లాంటివి వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేయటమే కాదు.. మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

జాతిని ఏకం చేసిన గాంధీ ఇంట.. ఆయన నమ్మిన విలువలకు భిన్నంగా ఆయన కుటుంబీకులు బాధితులుగా మారితే.. అందుకు భిన్నంగా మోడీ ఇంట తన తల్లిని ఎంతోఅప్యాయంగా చూసుకొన్న తీరు దేశంలోని రెండు వైరుధ్యాల్ని.. వివిధ మనస్తత్వాల్ని చాటి చెబుతుందని చెప్పక తప్పదు. ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళలో తొలిసారి తన కుమారుడి అధికార నివాసానికి వచ్చిన మోడీ తల్లి.. ఆయనతో కొద్దిరోజులు గడిపారు. ఈ విషయాన్ని ప్రధానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏమైనా రెండు భిన్నకోణాలు ఒకట్రెండు రోజుల తేడా తెర మీదకు రావటం నిజంగా ఆసక్తికర అంశంగా చెప్పాలి.