Begin typing your search above and press return to search.

డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకుండా దెబ్బేసిన మోడీ.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   17 May 2023 4:56 PM GMT
డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకుండా దెబ్బేసిన మోడీ.. అదెలానంటే?
X
పాతతరం వాసనలు ఉన్న సిద్దరామయ్యను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని చేయటానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. వంద మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్దూ వైపే మొగ్గు చూపారన్న లీకులతోపాటు.. నాలుగు రోజులకు పైగా సాగిన హైడ్రామాతో పాటు.. అలక పాన్పు ఎక్కిన డీకే శివకుమార్ ను బుజ్జగించింది కాంగ్రెస్. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ కు జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గెలుస్తామన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఆ మాత్రం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా ఉంటారా? ఇందుకు కదా కాంగ్రెస్ చేతికి పగ్గాలు ఇవ్వకూడదనుకునేది.. లాంటి మండిపాటు వ్యక్తమవుతున్న దుస్థితి.

ఇంతకీ డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కట్టబెట్టలేదు? అన్నంతనే కాంగ్రెస్ అధినాయకత్వం వైపు వేలు చూపిస్తారంతా. నిజానికి డీకేను సీఎం చేయటానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మక్కువ చూపుతారు. కానీ.. రాహుల్..ప్రియాంకలు మాత్రం సిద్దరామయ్య వైపే మొగ్గుచూపుతారు. అయితే.. సోనియా కానీ.. డీకేను సీఎం చేయాలని డిసైడ్ చేస్తే.. ఆమె మాటను కాదనే పరిస్థితి ఉండదు. కానీ.. ఆమె అనుకున్నట్లుగా చేయకపోవటానికి కారణం.. ఆమె కుమార్తె.. కుమారుడు అనే కంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రధాన కారణంగా చెప్పాలి.

నిజానికి.. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాలేదంటే దానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ వేసిన ఎత్తు అని చెప్పక తప్పదు. ప్రతి దానికి మోడీని ఏదో రకంగా లాగి బద్నాం చేస్తుంటారన్న మండిపాటు వ్యక్తం కావొచ్చు. కానీ.. తరచి చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం క్లారిటీ వచ్చిన గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా ఎంపిక చేయటం గుర్తుండే ఉండి ఉంటుంది.

మోడీ తీసుకున్న ఈ నిర్ణయం.. కర్నాటక సీఎం కుర్చీలో కూర్చోవాల్సిన డీకే శివకుమార్ కు అడ్డంకిగా మారింది. దీనికి కారణం.. డీకేకు సంబంధించిన కేసుల లెక్క ప్రవీణ్ సూద్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఆయన్ను సబీఐ చీఫ్ చేసిన నేపథ్యంలో డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయన్ను పాత కేసుల్లో అరెస్టు చేయించే వీలుంది.

ఇదే కాంగ్రెస్ అధినాయకత్వానికి సందేహంగా మారింది. అందుకే.. తాము అనుకుంటున్న డీకేకు బదులుగా సిద్దరామయ్యకు పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల వరకు సిద్దరామయ్యను సీఎం పదవిలో ఉంచి.. కుదుట పడిన తర్వాత డీకే చేతికి పగ్గాలు ఇవ్వాలన్న ప్లానింగ్ చేసినట్లు చెబుతారు.

ఇంతకీ డీకేకు ముఖ్యమంత్రి పగ్గాలు దక్కకూడదని మోడీ ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? అన్నది మరో ప్రశ్న, దీనికి సమాధానం వెతికితే.. డీకే శివకుమార్ తీరు సిద్దుకు భిన్నంగా ఉంటుంది. ఆయన ఒసారికి అధికారంలోకి వస్తే.. కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవటమేకాదు.. ప్రత్యర్థులకు చుక్కలు తప్పవన్న సంగతి మోడీకి బాగా తెలుసు. అందుకే.. ఎవరికి అధికారాన్ని ఎవరి చేతికి ఇచ్చినా ఫర్లేదు కానీ డీకే శివకుమార్ చేతికి మాత్రం రాకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. మొత్తంగా ముఖ్యమంత్రి పదవికి సిద్దునుఎంపిక విషయంలో మిగిలిన వారి కంటే ప్రధాని మోడీ ‘కీ’ రోల్ ప్లే చేశారని చెప్పక తప్పదు.