Begin typing your search above and press return to search.

మోడీ అందుకేనా ఆ వ్యాక్సిన్ వేపించుకొన్న‌ది..?

By:  Tupaki Desk   |   2 March 2021 3:25 AM GMT
మోడీ అందుకేనా ఆ వ్యాక్సిన్ వేపించుకొన్న‌ది..?
X
ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన‌ అంశాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ఒక‌టి. దేశీయంగా ఉత్ప‌త్తి చేసిన రెండు వ్యాక్సిన్ల‌లో ఏది ప్ర‌భావ వంత‌మైన‌ది? ఒక్క‌టి మాత్ర‌మే స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోందా? అప్పుడు.. మిగిలిన వ్యాక్సిన్ తీసుకున్న‌వారి ప‌రిస్థితి ఏంటీ..? ఇలా.. విస్తృత చ‌ర్చ న‌డుస్తోంది. దీనంత‌టికీ కార‌ణం.. ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ తీసుకున్న వ్యాక్సిన్. ఆయ‌న తీసుకున్న వ్యాక్సిన్.. కొన్ని విష‌యాల్లో రెండో వ్యాక్సిన్ క‌న్నా ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తోంద‌ని వార్త‌లు వెలువ‌డ‌డంతో చాలా మంది ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

కొవిడ్ ను అడ్డుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అందులో మొదటిది కొవిషీల్డ్ కాగా.. రెండోది కోవాగ్జిన్. ఇవి రెండు వ్యాక్సిన్ల‌నూ ప్ర‌జ‌ల‌కు వేస్తున్నారు. మొద‌టి ద‌శ‌లో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా ఉన్న వైద్యులు, పోలీసులు, ప్ర‌జాసేవ‌లో ఉన్న ఇత‌రులకు వ్యాక్సిన్ వేసిన విష‌యం తెలిసిందే. తాజాగా.. రెండో విడ‌త‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. వీరిలో దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తులు, 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి తొలి ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

అయితే.. తాజాగా ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు కేంద్ర బిందువు అయ్యింది. దేశప్రధాని ఏ వ్యాక్సిన్ వేసుకున్నారు? అనే విష‌య‌మై చాలా మంది ఆరాతీశారు. అది రెండో వ్యాక్సిన్ అయిన కొవాగ్జిన్‌. దీంతో.. ప్ర‌ధాని కొవాగ్జిన్ తీసుకున్నారు కాబ‌ట్టి.. అదే నాణ్య‌మైంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు చాలా మంది. అంతేకాదు.. దీనికి బ‌లం చేకూర్చేలా ఉన్నాయి ప‌లు రిపోర్టులు, వ్యాఖ్యానాలు!

ఈ విష‌య‌మై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై సంచలన ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వ్యాక్సిన్ 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న వారిమీద మాత్ర‌మే సమర్థంగా పని చేస్తోంద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని జర్మనీ ధృవీక‌రించింద‌ని గుర్తుచేశారు. దీంతో.. కొవిషీల్డ్ ప్ర‌భావ శీల‌త‌పై అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి.

ప్ర‌ధాని కూడా కొవాగ్జిన్ టీకా వేయించుకోవ‌డంతో.. సందేహాలు ఎక్క‌వ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం మోడీ వ‌య‌సు 70 సంవ‌త్స‌రాలు. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా కొవిషీల్డ్ 60 సంవ‌త్స‌రాలు దాటిన వారిపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు కాబ‌ట్టే.. మోడీ కొవాగ్జిన్ తీసుకున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. దీనికి ఓవైసీ మాట‌లు కూడా బ‌లాన్నిస్తున్నాయ‌ని అంటున్నారు చాలా మంది. దీంతో.. కొవిషీల్డ్ తీసుకున్న‌వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మకు వైర‌స్ సోకితే.. ఈ వ్యాక్సిన్ ఎంత మేర అడ్డుకోగ‌ల‌ద‌నే సందేహం వ్య‌క్తంచేస్తున్నారు.