Begin typing your search above and press return to search.

టీఆరెస్ తెస్తోందా..మోడీయే వస్తున్నారా

By:  Tupaki Desk   |   22 Jan 2016 10:06 AM GMT
టీఆరెస్ తెస్తోందా..మోడీయే వస్తున్నారా
X
ప్రధాని మోడీ తెలంగాణకు రాలేదని టీఆరెస్.. మోడీని తెలంగాణకు రమ్మని పిలవలేదని బీజేపీ ఒకరిపైఒకరు చేసుకుంటున్న ఆరోపణలు ముగింపు రానుంది. ఫిబ్రవరి 2వ వారంలో మోడీ తెలంగాణకు రానున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఆయన పర్యటించబోతున్నారు. కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. కేంద్ర మంత్రి హన్స్ రాజ్ శుక్రవారం ఈ సంగతి వెల్లడించారు. ప్రధాని రానుండడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది.

మరోవైపు రామగుండంలో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారాన్ని మోడీ ప్రారంభించనుండగా... దాని పక్కనే బొగ్గు ఆధారిత ఎరువుల కర్మాగారం కోసం ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వచ్చే నాలుగేళ్ల వరకు ఎరువుల ధరలు పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు.

కాగా రామగుండంలోని ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు దేశంలోనే పేరొందిన ఎరువుల పరిశ్రమ. చాలాకాలంగా అది మూతపడింది. రిలయన్స్ గ్యాస్ తో దాన్ని పునఃప్రారంభిస్తారని ఏడెనిమిదేళ్లుగా చెబుతున్నా ఇంతవరకు కార్యాచరణ లేదు. కరీంనగర్ జిల్లా నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రానికి, ఎఫ్ సీఐకి కలిపి కేజీ బేసిన్ నుంచి గ్యాస్ తెస్తామని రాజశేఖరరెడ్డి హయాంలో చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోడీ రాకతో మళ్లీ ఎఫ్ సీఐకి మంచి రోజులు రానుండడంతో తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారు.