ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓవైపు మాట్లాడుతూనే.. మరోవైపు నిధుల కటకటతో కిందామీదా పడుతోంది మోడీ సర్కారు. తమ హయాంలో దేశం వెలిగిపోతుందన్న మాటను చెబుతున్న మోడీ పరివారం.. వాస్తవానికి నిధుల లేమితో కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు. ఆశించినంతగా రెవెన్యూ రాకపోవటంతో లోటుతో సతమతవుతున్నారు. దీంతో.. అదనపు రాబడి కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా జీఎస్టీ మీద మోడీ మాస్టారి కన్ను పడినట్లుగా చెబుతున్నారు. 2017 జులై ఒకటిన తెచ్చిన జీఎస్టీ పన్ను రేట్లను మార్చటం తెలిసిందే. ఐదుశాతం పన్ను శ్లాబులోకి ఎక్కువ వస్తువుల్ని తీసుకొచ్చిన నేపథ్యంలో పన్ను ఆదాయం తగ్గినట్లుగా భావిస్తున్నారు. అందుకే.. ఐదుశాతం పన్ను శ్లాబ్ ను ఆరు శాతం చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ మోడీ సర్కారు అనుకున్నట్లు ఐదుశాతం ఉన్న జీఎస్టీ శ్లాబ్ ను ఆరు శాతంగా మారిస్తే దాదాపు వెయ్యి కోట్ల మేర అదనపు ఆదాయం ప్రతి నెలా సమకూరే అవకాశం ఉందంటున్నారు. అంటే.. ఏడాదికి రూ.12వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుంది. ఇంత భారీ మొత్తంలో రెవెన్యూ పెరిగే వీలు ఉండటంతో.. జీఎస్టీ శ్లాబ్ ను పెంచే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. అదే జరిగితే చాలా వస్తువుల ధరలు ఒక శాతం చొప్పున పెరగటం ఖాయం. జనంపై పన్ను వాతలు వేయటంలో ఎలాంటి మొహామాటం పడని మోడీ మాస్టారు జీఎస్టీ పోటును మరింత పెంచే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.