Begin typing your search above and press return to search.

మోడీతో పెట్టుకుంటే రాజీనామా త‌ప్ప‌లేదు

By:  Tupaki Desk   |   12 Jan 2019 8:01 AM GMT
మోడీతో పెట్టుకుంటే రాజీనామా త‌ప్ప‌లేదు
X
కుంభ‌కోణం కానీ.. భారీ నేరం కానీ జ‌రిగిన వెంట‌నే దేశ ప్ర‌జ‌ల‌కు గుర్తుకు వ‌చ్చేది సీబీఐ. అలాంటి సంస్థ‌కు డైరెక్ట‌ర్ అంటే మాట‌లా? ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు.. మ‌రెన్నో ప్ర‌య‌త్నాల అనంత‌ర‌మే ఆ స్థానానికి చేరుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంది. మ‌రి.. అంత క‌ష్ట‌ప‌డి సాధించిన సీటును మ‌న‌స్ప‌ర్ద‌ల‌తోనో.. మ‌రో కార‌ణంతోనో చేజార్చుకుంటారా? అంటే.. నో.. అని చెబుతారు.

సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌విని వ‌దులుకోవ‌టానికి బ‌దులు.. కాస్త రాజీ ప‌డ‌టం ఖాయ‌మంటారు. కానీ.. అలాంటి భావ‌న ఏ మాత్రం స‌రికాద‌న్న విష‌యాన్ని అలోక్ వ‌ర్మ త‌న చేత‌ల‌తో నిరూపించారు. త‌న‌ను నిర్బంద సెల‌వుపై పంపిన మోడీ స‌ర్కారుతో ఫైట్ చేయ‌టం తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. న్యాయ‌పోరాటంలో గెలిచిన ఆయ‌న త‌న‌ను ఖాళీ చేయించిన కుర్చీలోకి వ‌చ్చి కూర్చున్నారు.

త‌న మాటే వేదంగా.. త‌న క‌నుసైగ‌తో వ్య‌వ‌స్థ‌లు సైతం క‌దిలిపోవాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే మోడీకి.. అలోక్ వ‌ర్మ ఎపిసోడ్ అస్స‌లు న‌చ్చ‌లేద‌న్న‌ది తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థ‌మవుతుంది. త‌న‌కు న‌చ్చ‌ని సీబీఐ డైరెక్ట‌ర్ ను తీసేసి.. త‌న మ‌న‌సుకు న‌చ్చిన నాగేశ్వ‌ర‌రావును తెచ్చి పెట్టుకున్న మోడీ.. సుప్రీం తీర్పును రెండు రోజుల పాటు అమ‌లు అయ్యేలా చేసి.. తాను చేయాల్సింది చేసేశారు.

ప్ర‌ధానిగా త‌న‌కున్న విశేష అధికారాల‌తో పాటు.. నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు హైప‌ర్ క‌మిటీ లో అలోక్ వ‌ర్మ‌ను ఇంటికి పంపాల‌న్న నిర్ణ‌యాన్ని డిసైడ్ చేశారు. ఈ ప‌రిణామంతో మ‌న‌స్తాపానికి గురైన అలోక్ వ‌ర్మ‌.. తాను మోడీతో ఫైట్ చేసే సామ‌ర్థ్యం లేద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న‌ట్లుగా చెప్పాలి. అందుకేనేమో.. త‌న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన 48 గంట‌ల్లో త‌నపై బ‌దిలీ వేటు వేసిన మోడీ స‌ర్కారుతో తాను పోరాడ‌లేన‌ని ఫీల‌య్యారో ఏమో కానీ.. అలోక్ వ‌ర్మ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

సీబీఐ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన వ్య‌క్తికి అగ్నిమాప‌క విభాగం డీజీగా బ‌దిలీ చేసిన మోడీ స‌ర్కారు నిర్ణ‌యంపై అసంతృప్తితో ఉద్యోగానికే రాజీనామా చేశారు. తాను 2017 జులైలోనే రిటైర్ అయ్యాన‌ని.. దాంతో సంబంధం లేకుండానే త‌న‌కు సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌వికి రెండేళ్ల పాటు ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అలోక్ వ‌ర్మ మీద ఇప్పుడు క‌త్తి క‌ట్టిన మోడీ స‌ర్కారు.. కొద్ది నెల‌ల క్రితం ఆయ‌న్ను ఏరికోరి మ‌రీ సీబీఐ డైరెక్ట‌ర్ కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ.. మోడీ స‌ర్కారు మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగా ఆయ‌న ప‌ని చేయ‌క‌పోవ‌టంతో వేటు ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన‌ప్పుడు అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. మోడీతో పెట్టుకున్న వారెవ‌రైనా మాటాషేన‌ని.