Begin typing your search above and press return to search.

కోల్‌ క‌తా ర్యాలీలో మోదీని ఎలా టార్గెట్ చేశారంటే

By:  Tupaki Desk   |   19 Jan 2019 2:25 PM GMT
కోల్‌ క‌తా ర్యాలీలో మోదీని ఎలా టార్గెట్ చేశారంటే
X
కోల్‌ క‌తాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌ను చాటిచెప్పింది. కోల్‌ కతాలోని బ్రినేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో ప‌శ్చిమబెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, అఖిలేశ్ యాద‌వ్‌, శ‌ర‌ద్ ప‌వార్, చంద్ర‌బాబునాయుడుతో పాటు మ‌రికొంత మంది నేత‌లు ప్ర‌సంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గడువు ముగిసిపోయింది.. ఈ దేశానికి కొత్త ప్రధానిని త్వరలోనే తీసుకువస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్ర‌క‌టించారు. ``ఈ వేదిక ఐక్య భారత్‌ కు నిదర్శనంగా నిలవాలి. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేశారు. మోదీ హయాంలో రఫేల్ వంటి పెద్ద కుంభకోణాలు జరిగాయి. లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్, మాయావతి సహా ఎవర్నీ మోదీ ప్రభుత్వం వదల్లేదు. మీతో కలిసి ఉంటే పర్వాలేదు.. లేకపోతే అందరినీ అణగదొక్కుతారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించింది. ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం కూడా మారాల్సిన సమయం వచ్చింది. యువతకు పూర్తిగా ఉపాధి కల్పనను విస్మరించారు. రథయాత్ర పేరిట బెంగాల్ ప్రవేశించాలనుకునే అల్లరి మూకలను ఇక్కడ అడుగుపెట్టనివ్వబోం. మేం జగన్నాథ రథయాత్రను నమ్ముతాం.. కానీ అల్లరిమూకల రథయాత్రలను నమ్మం. ఈసారికి బీజేపీకి ఓటేస్తే మన డబ్బును దోచుకోవడం ఖాయం. బీజేపీకి నాయకత్వం లేదు. కానీ మా కూటమికి అన్ని పార్టీల నాయకత్వం ఉంది. అక్కడ కేవలం ఒక ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. కానీ మా కూటమిలో ప్రతి ఒక్కరూ నాయకుడే` అని మమతా బెనర్జీ ప్ర‌క‌టించారు.

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ ఇవాళ ఈ దేశ మహోన్నత రాజ్యాంగం పైనా దాడి జరుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడిని దేశం మొత్తం చూస్తోందన్నారు. ఐదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది అని మండిపడ్డారు. కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవులను ఆశించి తామంతా ఇక్కడకు రాలేదన్నారు. దేశంలో మార్పు సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. తమకు కావాల్సింది పదవులు కాదు.. ఈ దేశ ప్రజల రక్షణ, రైతన్నకు భద్రత, యువతకు భవిష్యత్ అని శరద్ పవార్ స్పష్టం చేశారు.

డీఎంకే నేత స్టాలిన్ త‌మిళంలో మాట్లాడుతూ దేశంలో రెండ‌వ స్వాతంత్య్ర స‌మ‌రం మొద‌లైంద‌న్నారు. మ‌నమంతా క‌లిసి క‌ట్టుగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌నం ఒకటైతే, బీజేపీ ఓట‌మి త‌థ్య‌మ‌న్నారు. అందుకే ప్ర‌ధాని మోదీ మ‌న‌పై ప్ర‌తి వేదిక‌లోనూ విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. దేశం ప‌ట్ల మోదీ వ్య‌తిరేకంగా ఉంటే, ఆయ‌న‌పై నేను వ్య‌తిరేకంగా ఉంటాన‌ని స్టాలిన్ అన్నారు. మోదీ చేప‌ట్టిన‌ విధ్వంస‌క‌ర విధానాల‌ను డీఎంకే నేత త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధానిపై త‌న‌కు వ్య‌క్తిగ‌త వ్య‌తిరేక‌త ఏమీలేద‌న్నారు. బెంగాల్‌ కు, త‌మిళంకు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. త‌మిళ‌నాడులో స్వామి వివేకానంద స్మార‌కం ఉంద‌ని గుర్తు చేశారు. రాజ‌కీయాల‌తో పాటు ఇత‌ర అంశాల్లోనూ బెంగాలీల త‌ర‌హాలోనే త‌మిళులు ఉంటార‌న్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ పిలుపు మేర‌కు తాను రెండవ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. అధికారంలోకి రాక‌ముందు న‌ల్ల‌ధ‌నంపై పోరాటం చేస్తామ‌న్నారు. కానీ అదేమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్ర‌తి అకౌంట్‌ లోకి 15 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు, ఇంత క‌న్నా పెద్ద మోసం ఏమి ఉంటుంద‌ని స్టాలిన్ ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాని మోదీ ఓ ప‌బ్లిసిటీ పీఎం అని, కానీ మ‌న‌కు ప‌నిచేసే ప్ర‌ధాని కావాల‌ని ఐక్య‌త ర్యాలీలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. త‌మ‌కు దేశాన్ని ఐక్యంగా ఉంచాల‌న్న ఉద్దేశం ఉంద‌ని, కానీ బీజేపీ మాత్రం దేశాన్ని విభ‌జిస్తోంద‌ని తెలిపారు. గ‌తంలో ఆర్థిక అభివృద్ధి బాగుండేద‌ని, అయితే ప్ర‌గ‌తి నెమ్మ‌దించ‌డం వ‌ల్ల ఉద్యోగాలు లేవ‌ని అన్నారు. క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చితే, బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈవీఎంలు ఓ పెద్ద ఫ్రాడ్ అన్నారు. ఏ దేశంలోనూ ఈవీఎంల‌ను వాడ‌డం లేద‌ని, మ‌ళ్లీ మ‌నం పేప‌ర్ బ్యాలెట్‌ ను తీసుకురావాల‌న్నారు. బీజేపీ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని, 2019లో కొత్త పీఎం వ‌స్తార‌ని బాబు అన్నారు.

దేశం ప్రమాదంలో ఉందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. విపక్షాల ప్రయత్నం బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు.. దేశాన్ని కాపాడుకోవడం అని చెప్పారు. ఈ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ప్రజలను విడగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లే జమ్మూకశ్మీర్ ఇవాళ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈవీఎంలు పూర్తిగా మోసపూరితమైనవి.. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించరాదు. ఈవీఎంలను రద్దు చేయాలని విపక్షాలన్నీ ఈసీని కోరాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా విపక్షాలు జాగ్రత్తపడాలి అని ఫరూక్ అబ్దుల్లా సూచించారు.

దొంగలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నట్లు గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్ధిక్ పటేల్ తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటీషర్లపై పోరాటం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇప్పుడు మేం దొంగలపై పోరాటం చేయాల్సిందిగా చెబుతున్నామన్నారు. దేశంలోని అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకులను ఒకే వేదికపై తెచ్చినందుకు మమతా బెనర్జీకి కృతజ్ఞతలు అన్నారు. బీజేపీ అధికారంలోకి రాద‌నేందుకు ఇదే సంకేతమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సామాజిక కార్య‌క‌ర్త, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ మాట్లాడారు. దేశంలో అసాధార‌ణ రీతిలో సంక్షోభం నెల‌కొని ఉంద‌న్నారు. రాజ్యాంగ స్పూర్తిని ప‌రిర‌క్షించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. సుభాష్ చంద్ర‌బోస్ తెల్ల‌వారితో పోరాడాడు అని, మ‌నం దొంగ‌ల‌తో పోరాడాల‌ని గుజ‌రాత్ నేత హార్థిక్ ప‌టేల్ అన్నారు. త‌న ప్ర‌సంగంలో మోదీ-షాపై ఆయ‌న ఫైర్ అయ్యారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా నేత హేమంత్ సోరెన్ కూడా మాట్లాడారు. దేశంలో వాతావ‌ర‌ణం ఆందోళ‌న‌క‌రంగా మారింద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని, దేశ ఐక్య‌తను కాపాడాల్సిన బాధ్య‌త యువ‌త చేతుల్లో ఉంద‌న్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ సీఎం గీగంగ్ అపాంగ్ మాట్లాడారు. ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం వాజ్‌పేయి సూత్రాల‌ను పాటించ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్య నిర్ణ‌యాత్మ‌క విధానాన్ని బీజేపీ నాశ‌నం చేస్తోంద‌న్నారు. కేవ‌లం అధికారం కోస‌మే బీజేపీ ప‌నిచేస్తోంద‌న్నారు.