Begin typing your search above and press return to search.

21 రోజుల లాక్ డౌనా?.. అమెరికాను చూస్తుంటే న్యాయమే

By:  Tupaki Desk   |   25 March 2020 2:55 PM GMT
21 రోజుల లాక్ డౌనా?.. అమెరికాను చూస్తుంటే న్యాయమే
X
ప్రాణాంకత వైరస్ కోవిడ్- 19 ను కట్టడి చేసేందుకు భారత్ 21 రోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. మంగళవారం రాత్రి మీడియా ముందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కరోనా మహమ్మారిని తరిమివేయాలంటే... ఈ మాత్రం కఠిన నిబంధనలు తప్పనిసరి అని కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ 21 రోజుల పాటు మనం స్వీయ నియంత్రణలోకి వెళితే... మున్ముందు మనం భద్రమైన భవిష్యత్తును కొనసాగించవచ్చని కూడా పిలుపునిచ్చారు. అయినా కోవిడ్- 19ను పారదోలేందుకు మూడు వారాల పాటు ఇంటి నుంచి కదలొద్దంటూ నిబంధనలు పెట్టడమేమిటన్న వాదనలు అక్కడక్కడా వినిపిస్తున్నా... వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్కరు కూడా నోరిప్పడం లేదు. అయితే ఇలా నోరిప్పేందుకు భయపడి మనసులోనే బాధపడుతున్న వారు కూడా 21 రోజుల లాక్ డౌన్ న్యాయమేనని ఒప్పించేలా ఇప్పుడు ఓ కొత్త విశ్లేషణ ఎంట్రీ ఇచ్చింది. ఈ విశ్లేషణ వింటే... ఏ ఒక్కరు కూడా 21 రోజుల లాక్ డౌన్ కాదు కదా... అసలు ఇంకా ముందు నుంచే ఆంక్షలు మొదలెట్టి ఉంటే బాగుండేది కదా అన్న వాదన వినిపించడం ఖాయమే.

అయితే ఆ కొత్త విశ్లేషణ ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. కరోనా వైరస్ గురించి అగ్రరాజ్యం అమెరికా - ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు - వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏపాటివో ఒక్కసారి చూడాల్సిందే. చైనా నుంచే ఎంట్రీ ఇచ్చిన కరోనా... ఆ దేశాన్ని ఆ తర్వాత ఇటలీని, ఇప్పుడు అమెరికాను ఎలా భయపెడుతుందో తెలిసిందే. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతెందుకు?... ఓ దేశానికి చెందిన కీలక అధికారితో భేటీ అయ్యాక... సదరు అధికారికి కరోనా పాజిటివ్ అని తేలగా... ట్రంప్ తో పాటు వైట్ హౌస్ ఎంతలా వణికిపోయిందో తెలిసిందే. అయితే అంత భయాందోళనకు గురైనా గానీ... అమెరికాలో వైసర్ వ్యాప్తికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఏమాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఈ ఫలితంగా ఇప్పుడు న్యూయార్క్ లో మూడు రోజుల వ్యవధిలో 2,500 మందికి కరోనా సోకగా... ఒకే రోజు 210 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే... ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం, లాక్ డౌన్ ప్రకటించడం ఆలస్యమైన నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి ఇంతలా మారిందని చెప్పాలి.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... మార్చి 8న అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 564గా నమోదు కాగా... భారత్ లాగా ఆ దేశం తక్షణ చర్యలు తీసుకోని ఫలితంగా మార్చి 8 నుంచి బుధవారం (కేవలం 17 రోజుల వ్యవధిలోనే) నాటికి ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 52 వేల దాకా పెరిగిపోయింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలను చెక్ చేయకపోవడం - చాలా నగరాల్లో లాక్ డౌన్ ప్రకటన ఆలస్యంగా చేయడం... తదితర కారణాలతోనే అమెరికాలో రోగుల సంఖ్య ఈ మేర పెరిగిపోయిందని చెప్పాలి. అదే సమయంలో లాక్ డౌన్ గానీ, మరింత కఠిన నిబంధనలు అమలు చేయడంలో గానీ భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకోని ఫలితంగా అమెరికా తరహాలో రోగుల సంఖ్య నమోదు కాలేదు. మొత్తంగా చూస్తే... 21 రోజుల పాటు లాక్ డౌన్ దిశగా మోదీ తీసుకున్న నిర్ణయం ఏ కోణంలో చూసినా ఆమోదయోగ్యమేనని చెప్పాలి.