Begin typing your search above and press return to search.

ఇరుకున పడ్డ బాబుకు మోడీ అండ

By:  Tupaki Desk   |   29 Dec 2022 8:58 AM GMT
ఇరుకున పడ్డ బాబుకు మోడీ అండ
X
చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఒక దుర్ఘటన వెంటాడుతూనే ఉంటుంది. అది రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇస్తూ ఉంటుంది. అదే ఆయన సీఎం గా ఉండగా 2015లో జరిగిన గోదావరి పుష్కరాల ఘటనలో 29 మంది మరణించిన ఘటన. నాడు బాబు సినీ డైరెక్టర్ బోయపాటితో షూటింగ్ చేయించడం కోసం జనాలను ఆపేసి ఒక్కసారిగా వారిని వదిలారని, దాని వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది బలి అయిపోయారని వైసీపీ ఈ రోజుకీ అంటూంటుంది.

ఇక బాబు ప్రచార యావకు అది పరాకాష్ట అని కూడా విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. అది అలా ఉండగానే ఇపుడు మరో ఘోర విషాదం బాబు టూర్ లో జరిగింది. ఆయన ఇపుడు విపక్ష నేత. ప్రతీ జిల్లాను ఆయన కలియతిరుగుతున్నారు. బాబు సభలకు ఈ మధ్య జనాలు బాగా వస్తున్నారు. మరి నిర్వహాకుల లోపమా లేక పోలీసుల నిర్వాకం శాపమా లేక రాజకీయంగా ప్రారబ్దమా తెలియదు కానీ ఏకంగా ఎనిమిది మంది అమాయకులు బాబు రోడ్ షోలో మరణించారు.

ఇదిపుడు అధికార వైసీపీకి ఒక అస్త్రంగా మారింది. చనిపోయిన వారు ప్రజలు, మనుషులు. అయితే అందులో నుంచి కూడా రాజకీయం చూసేలా వర్తమానం ఉంది. అందుకే వైసీపీ బాబును కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఒక విధంగా బాబు ఇరుకునపడ్డారనుకోవాలి. ఆయన సభలో ఇలా జరగడంతో ఆయన తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. పైగా రాజకీయ విమర్శలు.

సరిగ్గా ఈ టైంలో దేశాన్ని ఏలే ప్రధాని బాధితులకు సంతాపం తెలియచేస్తూనే చంద్రబాబు ఈ ధైర్యంగా ఉండాలని కోరారు. ఆయనకు భరోసా ఇచ్చారు. ఇది నిజంగా విశేషంగానే చెప్పుకోవాలి. బీజేపీకి చెందిన మోడీ బాబు పట్ల సానుకూలంగా ఉండరు అన్న దానికి భిన్నంగా మోడీ బాబు కష్ట సమయంలో అండగా నిలవడం చర్చనీయంశం అవుతోంది.

అధికార వైసీపీ బాబుని టార్గెట్ చేస్తూ చీల్చి చెండాడుతున్న నేపధ్యంలో దేశానికి పెద్ద అయిన మోడీ నుంచి ఈ తరహా మద్దతు లభించడం అంటే సామాన్య విషయం కాదు. బాబు కూడా బీజేపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం ఇంతకాలం చూస్తూ వస్తున్నారు. ఇపుడు కష్టకాలంలో ఆయనకు మోడీయే వెన్నుతట్టి నేనున్నాను అని చెప్పడం అంటే తమ్ముళ్ళతో పాటు అంతా తేరుకుంటున్నారు.

కందుకూరు రోడ్ షో విషాదం తెలుగుదేశం పార్టీని డీ మోరలైజ్ చేసింది. ఇప్పటిదాకా బాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి పెల్లుబికిన ఉత్సాహంతో ఉన్న వారంతా ఇపుడు పూర్తిగా ఆత్మ రక్షణలో పడ్డారు. తప్పు జరిగిపోయింది అతి పెద్ద పొరపాటు సరిదిద్దుకోలేని వ్యవహారమే జరిగింది అని బాధలో ఉన్నారు. ఈ టైం లో మోడీ ఇచ్చిన భరోసా ఓదార్పు వెలకట్టలేనివే అని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ రాజకీయ నేతగా కాకుండా రాజనీతిజ్ఞుడిగా ఉన్నారని అంతా అంటున్నారు. ఏపీ నేతలు కూడా ఆయన్ని చూసి కష్టంలో అంతా ఒక్కటిగా నిలిచి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.