Begin typing your search above and press return to search.

గిన్నీస్ రికార్డ్: మోడీ సూటా.. మజాకా!

By:  Tupaki Desk   |   20 Aug 2016 8:05 AM GMT
గిన్నీస్ రికార్డ్: మోడీ సూటా.. మజాకా!
X
ఒక సూటు.. భారతదేశంలోని రాజకీయాల్లో పెనుదుమారమే లేపింది. అదే భారత ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూటు. ఈ విషయంపై అప్పట్లో రాహుల్ గాంధీ తో మొదలెట్టి అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీల ను ఉంచి, సోషల్ మీడియాలో సామాన్యుడి వరకూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు మోడీ ధరించిన ఖరీదైన సూటు తాజాగా ఒక రికార్డును సృష్టించింది. అది కూడా అలాంటిలాంటి రికార్డు కాదు.. గిన్నీస్ రికార్డు!

వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఈ సూటు రూ. 4.31 కోట్లకు అమ్ముడయ్యిందని, గుజరాత్ కు చెందిన లాల్జీభాయ్ తులసిబాయ్ పటేల్ ఫిబ్రవరి 20 - 2015న దీన్ని దక్కించుకున్నారని తెలిసింది.

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ వచ్చిన సందర్భంగా ఢిల్లీలో ఒబామాతో సమావేశమైనప్పుడు మోడీ ఈ సూట్‌ ధరించారు. "నరేంద్ర దామోదర్ దాస్ మోదీ" పేరు కనిపించేలా తయారు చేయడం ఈ సూట్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న రమేశ్ విరాణి వ్యాపారవేత్త ఈ సూటును మోడీకి బహుమతిగా ఇచ్చారు. దీన్ని తయారు చేయడానికి సుమారు రూ.10లక్షలు అయినట్లు వార్తలు రావడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.