Begin typing your search above and press return to search.

మోడీ నోట వచ్చిన ‘వార్’ మాటలు చెప్పేదేమిటి?

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:46 AM GMT
మోడీ నోట వచ్చిన ‘వార్’ మాటలు చెప్పేదేమిటి?
X
ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో దాయాది పాక్ పై భారత్ వార్ కి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే కొద్ది రోజులుగా ప్రధాని మోడీ తీరు కాస్త అటూఇటూగా అలానే ఉంది. ఉరీ ఉగ్రఘటన తర్వాత శనివారం తొలిసారి బహిరంగ సభలో మాట్లాడిన మోడీ ప్రసంగాన్ని అందరూ ఆసక్తిగా విన్నారు. మోడీ ఏం మాట్లాడతారు? ఎలాంటి పిలుపు ఇవ్వనున్నారు? తన మాటలతో పాకిస్థాన్ కు ఏదైనా వార్నింగ్ ఇస్తారా? మొన్నటికి మొన్న ఐక్యరాజ్యసమితి వేదిక మీద నవాజ్ షరీఫ్ నోరు పారేసుకున్న దానికి మోడీ రియాక్షన్ ఎలా ఉండనుంది? లాంటి ప్రశ్నలతో మోడీ ప్రసంగాన్ని విన్నపుడు ఆయనెంత తెలివిగా మాట్లాడారో అనిపిస్తుంది.

యుద్ధానికి సై అంటే సై అంటూనే.. అందరిని ఆకట్టుకునేలా ‘వార్’ మాటను తిప్పేయటం కనిపిస్తుంది. పాక్ తీరుపై జాతిజనులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. పాక్ తో యుద్ధం అనే విషయానికి వచ్చేసరికి దేశ జనులంతా సిద్దంగా లేరన్నవిషయాన్ని మోడీ అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. మాటల్లో దూకుడు పెంచుతూనే.. తనలోని వ్యక్తిత్వ వికాస నిపుణుడ్ని మరింతగా బయటకు తీస్తూ ఆచితూచి మాట్లాడారు. దేశ ప్రజలనే కాదు.. దాయాది దేశ ప్రజల్ని సైతం కదిలించేలా.. వారిలోనూ ఆలోచనలు రేకెత్తించేలా మోడీ మాట్లాడటం గమనార్హం.

ఓ పక్క రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. రెండు దేశాలు.. ప్రజలు ఫోకస్ చేయాల్సిన అసలు విషయాలు వేరుగా ఉన్నాయని చెబుతూ.. రెండు దేశాలకు స్వాతంత్ర్యం ఒకేసారి వచ్చినా.. భారత్ లో ఉన్న పరిస్థితి ఏమిటి? పాక్ లో నెలకొన్న పరిస్థితి ఏమిటన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. పాక్ ప్రజల్లో సొంత సర్కారు మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది.

మోడీ మాటలతోనే పాక్ ప్రజల్లో మార్పు వస్తుందని అనుకోలేం కానీ.. ఈ తరహా మాటలతో పాక్ లోని ఒకవర్గాన్ని అయితే ఆకర్షించొచ్చన్న వ్యూహంలో మోడీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఉగ్రవాదం కారణంగా పాక్ ఎంతలా అతలాకుతలం అవుతున్నది.. పాక్ ప్రజలు స్వయంగా ఎన్ని అగచాట్లు పడుతున్నది ఆ దేశ ప్రజలకు తెలియనిది కాదు. ఇదంతా పాక్ పాలకుల పాపమే తప్పించి మరొకటి కాదన్న విషయాన్ని పాక్ ప్రజల్లో ఇంజెక్ట్ చేసేలా మోడీ మాటలు ఉండటం గమనార్హం. అంతేకాదు.. రేపొద్దున పాక్ మీద వార్ కు వెళ్లినా.. అదంత దూకుడుగా తీసుకున్న నిర్ణయం కాదని.. సహనం పూర్తిగా ఇంకిపోయిన తర్వాత.. ఆత్మరక్షణ కోసమే తాను చేయాల్సింది చేసినట్లుగా ఉండేలా మోడీ మాటలు ఉన్నాయని చెప్పాలి.

ఆయన మాటల్లోనే వింటే... దాయాది మీద వార్ విషయంలో మోడీ ఆలోచన ఏమిటి? వ్యూహం ఏమిటి? అన్నది ఇట్టే అర్థమవుతుంది. ‘‘మీ నేతలు వెయ్యేళ్ల యుద్ధానికి సిద్ధమంటున్నారు. దమ్ముంటే రండి. మీకు యుద్ధమే కావాలనుకుంటే రండి చేద్దాం. భారతదేశం అందుకు సిద్ధంగా ఉంది. మీకు అంత శక్తి ఉంటే పేదరికానికి వ్యతిరేకంగా పోరాడండి. ఎవరు ముందుగా పేదరికాన్ని నిర్మూలిస్తారో.. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారో.. శిశుమరణాల్ని.. పౌష్టికాహారలేమిని నిరోధిస్తారో.. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇరు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. మేం ఇతరదేశాలకు సాఫ్ట్ వేర్ ను ఎగుమతి చేస్తున్నాం. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది. ఈ విషయంపై పాక్ ప్రజలు తమ నేతల్ని ప్రశ్నించాలి. పాక్ ప్రజలే దేశ నాయకత్వంపై.. ఉగ్రవాదులపై తిరగబడేరోజు వస్తుంది. భారత్ పై వెయ్యేళ్ల యుద్ధం చేస్తామంటూ ఆ దేశ నేతలు అనేవారని.. వారంతా ఇప్పుడు ఏమయ్యారు? వెయ్యేళ్ల యుద్ధాన్ని నేను స్వీకరిస్తున్నాను. పాక్ తో భారత్ యుద్ధం చేయాలని కోరుకుంటుందనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ధైర్యం ఉంటే.. పేదరికం.. నిరుద్యోగం.. నిరక్షరాస్యత.. శిశుమరణాలపై యుద్ధం చేద్దాం. చూద్దాం.. ఏ దేశం గెలుస్తుందో? ఇండియానా? పాకిస్థానా?’’ అంటూ సవాలు విసిరారు.

పాక్ నోట వెంట తరచూ వచ్చే కశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడిన మోడీ.. తాను పాక్ ప్రజలతో మాట్లాడాలని అనుకుంటున్నానంటూ పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటం గమనార్హం. ‘‘1947కు ముందు పాక్ ప్రజల పూర్వీకులు భారత్ నే తమ మాతృభూమిగా గుర్తించి వందనం చేసేవారన్న విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నా. పాక్ అక్రమిత కశ్మీర్.. ఒకప్పటి బంగ్లాదేశ్ ను.. పఖ్తూనిస్థాన్.. గిల్గిట్.. బలూచిస్థాన్ ను సరిగా చక్కదిద్దుకోలేని మీద నేతలు కశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారో మీరు మీ నేతల్ని అడగాలి’’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఉరీలో ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన సైనికుల త్యాగాలు ఊరికే పోవని.. వారి బలిదానం భారత్ మర్చిపోదన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పిన మోడీ మాటలకు పాక్ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.