Begin typing your search above and press return to search.

ఆ దేశంలో చేసింది మనం కూడా కాపీ చేయాలా మోడీ?

By:  Tupaki Desk   |   20 March 2020 5:23 AM GMT
ఆ దేశంలో చేసింది మనం కూడా కాపీ చేయాలా మోడీ?
X
కరోనా వైరస్ భయాందోళనలు దేశాన్ని చుట్టిముట్టిన వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగాన్ని దేశ ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. ఆయనేం చెబుతారన్న అంశంపై పెద్ద ఎత్తున ఉత్కంట చోటు చేసుకుంది. కరోనా వైరస్ కు మందు లేదన్న విషయాన్ని మరోసారి చెప్పిన మోడీ.. స్వీయ క్రమశిక్షణతో ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్న విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు గడిచిన రెండు నెలలుగా కృషి చేస్తున్న వైద్యులు.. అధికారులు.. పారామెడికల్ సిబ్బందిని.. ఎయిర్ లైన్స్ సిబ్బందిని.. పారిశుధ్య కార్మికుల్ని.. మీడియా సిబ్బందిని అభినందించాల్సిందిగా ప్రధాని మోడీ కోరారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటల వేళలో.. దేశ ప్రజలు తమ ఇళ్లల్లోని బాల్కనీల నుంచి.. ఇళ్ల తలుపుల నుంచి.. వీరందరికి అభినందనలు తెలియజేయటానికి వీలుగా ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని కోరారు. చప్పట్లు కాకుంటే.. గంటలు కొట్టాలని..సెల్యూట్ చేయటం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయొచ్చంటూ పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు వినేందుకు బాగానే ఉన్నా.. ఇదంతా కాపీ ఐడియా కావటం గమనార్హం. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాల్ని కాపాడేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి విధులను నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి శాల్యూట్ చేసేందుకు వీలుగా.. దేశ ప్రజలు రాత్రి వేళ.. చప్పట్లు కొట్టాలని ఫ్రాన్స్ దేశాధినేత పిలుపునివ్వటం తెలిసిందే. తమ దేశాధినేత టీవీలో పిలుపునిచ్చిన ఐదు నిమిషాలకే.. ఆ దేశ ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు.. వైద్య సిబ్బందికి తమ సంఘీభావాన్ని.. కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఇదే ఐడియాను.. వైద్యులు.. వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు.. మీడియాలకు కలిపి మోడీ మాష్టారు.. దేశ ప్రజల్ని చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కాపీ ఆలోచనల కంటే ఒరిజినల్ గా కొత్తగా ఏమైనా ఆలోచించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.