Begin typing your search above and press return to search.

మోడీ ఇలాకాలో సోనియా..ఫ్లైట్ పంపిన మోడీ!

By:  Tupaki Desk   |   3 Aug 2016 8:52 AM GMT
మోడీ ఇలాకాలో సోనియా..ఫ్లైట్ పంపిన మోడీ!
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో సోనియా గాంధీ రోడ్ షో నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఈ రోడ్ షో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే అనుకోవాలి. ఈ రోడ్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన సోనియా కు కార్యకర్తల నినాదాలు.. పార్టీ శ్రేణుల కోలాహలం.. అభిమానుల అభివాదాలు కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. వారణాసి సర్క్యూట్ హౌస్ దగ్గర బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటంతో ప్రారంభమైన సోనియా రోడ్‌ షో.. సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల మేర సాగింది. మోడీ వారణాసి నుంచి ఎన్నికై ప్రధాని అయిన తర్వాత సోనియా ఇక్కడికి రావటం ఇదే తొలిసారి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఉత్తరప్రదేశ్‌ లో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఇలా భారీస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు సోనియా.

సోనియా వెంట యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్ - కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్ - ప్రమోద్ తివారీ - సంజయ్‌ సింగ్ - రాజ్‌ బబ్బర్‌ లు పాల్గొన్నారు. వందలాది కార్యకర్తలు మోటార్ బైక్‌ లపై ఆమెను అనుసరిస్తుండగా.. ముందుగా కారు డోరు తీసుకుని నిలబడి ప్రజలను చూసి చేతులు ఊపిన సోనియా - అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించారు. ఇలా సాగుతున్న రోడ్ షో లో అనూహ్యంగా ఆమె అనారోగ్యం పాలయ్యారు.

నిజానికి సోనియాగాంధీ ఈ రోడ్‌ షో ప్రారంభమయ్యే సమయానికే వైరల్‌ ఫీవర్‌ తో బాధపడుతున్నారట.. అయితే వాయిదా వేస్తే కార్యకర్తల్లో నిరాశ కలుగుతుందని భావించిన ఆమె అనుకున్న సమయానికే రోడ్ షో ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఆ జ్వరం తీవ్రమవడంతో ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. సోనియా అనారోగ్యం విషయం తెలియగానే స్పందించిన ప్రధాని మోడీ.. ఆమె త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేసి, చికిత్స చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని - వైద్యుడిని పంపారు.