Begin typing your search above and press return to search.

మోదీ స్ట్రైట్‌ అటాక్ షురూ!... బాబుకు క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   2 Jan 2019 4:07 PM GMT
మోదీ స్ట్రైట్‌ అటాక్ షురూ!... బాబుకు క‌ష్ట‌మే!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి మ‌రో ఐదు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్నా... వాటితో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ వేడి అంత‌కంత‌కూ రాజుకుంటోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ కలిసి పోటీ చేసినా... ఇటీవ‌లే ఈ పొత్తును టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స్వ‌యంగా తుంచేశారు. వ‌చ్చే ఎన్నికల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్న చంద్ర‌బాబు... వచ్చే ఎన్నిక‌ల్లో మోదీ గ‌నుక గెలిస్తే దేశం నాశ‌నం అవ‌తుందంటూ ఇటీవ‌ల స్వ‌రం పెంచేశారు. ఈ క్ర‌మంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత నాలుగేళ్లుగా క‌లిసి సాగిన బీజేపీ - టీడీపీల మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నెల 6న గుంటూరులో జ‌ర‌గ‌నున్న బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు మోదీ వ‌స్తున్నార‌న‌గానే... ఈ ప‌రిస్థితి మ‌రింత‌గా ముదిరింది. మోదీ వ‌స్తే... నిర‌స‌న త‌ప్ప‌దంటూ స్వ‌యంగా సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబే ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ముఖ్య‌మంత్రే నిర‌స‌న వ్య‌క్తం చేస్తే ప్ర‌దాని స‌భ ఎలా జ‌రుగుతుంద‌న్న వాద‌న‌పైనా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల మోదీ స‌భ ర‌ద్దు కాగా.. టీడీపీ ఊపిరి పీల్చుకుంది.

అయితే నిన్న‌టికి నిన్న ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ... నేరుగా చంద్ర‌బాబును టార్గెట్ చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో సిద్ధాంతాల‌ను ప‌క్క‌నపెట్టి కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్న టీడీపీకి తెలంగాణ ప్ర‌జ‌లు గ‌ట్టిగా బుద్ధి చెప్పార‌ని మోదీ వ్యాఖ్యానించారు. అస‌లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారును ఓడించేందుకంటూ రాహుల్ గాంధీతో క‌లిసి చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన మ‌హా కూట‌మికి ఆదిలోనే గ‌ట్టి దెబ్బ త‌గిలింద‌ని చెప్పారు. మొత్తంగా మొన్న‌టిదాకా చంద్ర‌బాబుపై నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించని మోదీ... నిన్న‌టి నుంచి బాబును టార్గెట్ చేస్తూ ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం మొద‌లుపెట్టార‌నే చెప్పాలి. తాజాగా నేడు విజ‌య‌న‌గ‌రం - విశాఖ‌ప‌ట్ట‌ణం - మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు నియోజక‌వ‌ర్గాలకు చెందిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పార్టీ బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను వివ‌రించ‌డంతో పాటుగా చంద్ర‌బాబుతో పాటు టీడీపీ ప్ర‌భుత్వంపైనా మోదీ నేరుగానే ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను నీతి ఆయోగ్ చెబితేనే తాము చేప‌ట్టామ‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌స్తావించిన మోదీ... అందులో ఎంత‌మాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి పారేశారు. ప్రాజెక్టును తామే నిర్మించుకుంటామ‌ని చంద్ర‌బాబు అడిగార‌ని - ఆ మేర‌కే తాము ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను ఏపీకి అప్ప‌గించామ‌ని చెప్పారు. అంతేకాకుండా జాతీయ హోదా క‌లిగిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తి పైసానూ కేంద్రం నుంచే విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టిదాకా ఈ ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్ల‌ను విడుద‌ల చేశామ‌ని - ప్రాజెక్టు పూర్త‌య్యే దాకా నిధుల బాధ్య‌త త‌మ‌దేన‌ని కూడా మోదీ చెప్పుకొచ్చారు.

ఏపీకి కేంద్రం నిధులు ఇస్తూ వ‌స్తోంటే... చంద్ర‌బాబు మాత్రం కేంద్రం నిధులు రావ‌డం లేద‌ని అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రిసోర్స్ గ్యాప్‌ - ఆర్థిక లోటు భ‌ర్తీకి సంబంధించి ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏపీకి రూ.20 వేల కోట్ల‌ను విడుద‌ల చేశామ‌ని చెప్పిన మోదీ... ఆ నిధుల‌న్నీ ఎవ‌రి జేబుల్లోకి వెళ్తున్నాయ‌ని సూటిగానే ప్ర‌శ్నించారు. పోలవ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తున్నా... వాటిని స‌ద్వినియోగం చేయ‌డం - ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిగెత్తించే విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు చ‌తికిల‌బ‌డుతోంద‌ని కూడా మోదీ ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విష‌యాన్ని తాను చెప్ప‌డం లేద‌ని కాగ్ రిపోర్టే ఈ మాట చెబుతోంద‌ని కూడా మోదీ క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ఇక వెనుక‌బ‌డిన జిల్లాల‌కు కేంద్రం ఇస్తున్న నిధుల‌ను కూడా ప్ర‌స్తావించిన మోదీ... ఈ విభాగంలో ఏపీకి ఇప్ప‌టిదాకా రూ.1000 కోట్లు మంజూరు చేశామ‌ని చెప్పారు. అయితే ఆ నిధుల‌కు సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కారు యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు కూడా ఇవ్వ‌లేద‌ని మోదీ ఆరోపించారు. యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు త‌మ‌పైనే ఉల్టా ఆరోప‌ణ‌లు సంధిస్తోంద‌ని కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియా ద్వారా ఇప్ప‌టిదాకా కేంద్రంపై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ కూడా అవాస్త‌వాలేన‌ని మోదీ చెప్ప‌క‌నే చెప్పేశారు. మ‌రి మోదీ స్ట్రైట్ క్వ‌శ్చ‌న్‌ల‌కు చంద్ర‌బాబు అండ్ కో నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.