Begin typing your search above and press return to search.

బెంగాల్ లో బ్రిడ్జి కూలినప్పుడు ఏమన్నారు మోదీ...? సోషల్ మీడియాలో వైరల్

By:  Tupaki Desk   |   31 Oct 2022 10:30 AM GMT
బెంగాల్ లో బ్రిడ్జి కూలినప్పుడు ఏమన్నారు మోదీ...? సోషల్ మీడియాలో వైరల్
X
గుజరాత్ లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత 40, 60, 91 అనుకుంటే.. ఇప్పుడది 132కు చేరింది. దీంతో త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కేవడియాలో ఉన్న మోదీ.. తన ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించేనని అన్నారు.

సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని మీకు హామీ ఇస్తున్నానని వెల్లడించారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఐక్యతా ప్రతిమ వద్ద ప్రధాని నివాళి అర్పించారు. 'ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ముందున్నాయి. నిన్నరాత్రే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మోర్బీకి చేరుకున్నారు. సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఎలాంటి అలసత్వం ఉండదని మీకు హామీ ఇస్తున్నాను. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు కమిటీని నియమించాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడినవారికి తక్షణ వైద్యం అందేలా చూస్తున్నాం' అని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముంగిట ఇలా ఏమిటబ్బా..? అసలే గుజరాత్.. ఆపై మోదీ.. దీనికిమించి నెల రోజుల్లో ఎన్నికలు.. ఈ సమయంలో బ్రిడ్జి కూలిన ఘటన పాలక బీజేపీని సంకటంలోకి నెట్టడం ఖాయం. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రితం సారి కేవలం కాంగ్రెస్ తో తలపడి.. చచ్చీచెడి గెలిచిన గుజరాత్ లో ఈసారి ఆప్ తలపోటు మొదలైంది. ఈ ముక్కోణపు పోటీలో ఎక్కడ మునుగుతామోనని బీజేపీకి బెంగ పట్టుకుంది. అందుకనే ఈ ఘటనను గుజరాత్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇవాళ ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్‌ సంఘ్వీ
మాట్లాడుతూ ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

దీంతోపాటు ఐదుగురు సభ్యుల కమిటీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తుందన్నారు. బ్రిటిష్‌ కాలం నాటి ఈ వంతెనకు మరమ్మతులు నిర్వహించిన తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు స్థానిక మున్సిపల్‌ విభాగం చీఫ్‌ సందీప్‌ సిన్హ్‌ పేర్కొన్నారు. మోర్బీ నగరంలోని ఝూల్తా పూల్‌ (వేలాడే వంతెన)కు 7 నెలలపాటు మరమ్మతుల నిర్వహించి.. గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న దాన్ని తిరిగి తెరిచారు. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. వంతెనపైకి వందల మంది చేరారు. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక సాయంత్రం 6:30 గంటలకు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

అప్పుడు బెంగాల్ లో ఏమన్నారో గుర్తుందా?2019 ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు గుజరాత్ లోగా బ్రిడ్జి కూలింది. దీనిపై ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. పాలక బెంగాల్ సర్కారును నిలదీశారు. అప్పట్లో బ్రిడ్జి కూలడాన్ని బెంగాల్ టీఎంసీ నేతలు యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడి చర్య)గా అభివర్ణించారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని మోదీ.. ''దీదీ.. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్'గా అభివర్ణించారు.

దేవుడు అంతా చూశాడని అందుకే ఇలా జరిగిందని అన్నారు. గుజరాత్ లో ఇప్పుడు బ్రిడ్జి కూలిన సందర్భంలో సోషల్ మీడియాలో మోదీ నాటి మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై ఏమంటారు మోదీ.. అంటూ ఆయన వ్యతిరేక శక్తులు నిలదీస్తున్నారు. 'ఇప్పుడు బ్రిడ్జి కూలింది.. ఆపై బెంగాల్ మమతా సర్కారు కూలింది. బ్రిడ్జి లానే బెంగాల్ కూడా కూలిపోద్ది. అందుకే ఈ సర్కారు సాగనంపండి'అంటూ భగవంతుడు సందేశం ఇచ్చాడని నాడు మోదీ అన్నారు. అసలే చురుకైన వారైన సోషల్ మీడియా
యాక్టివిస్టులు ఇదే విషయాన్ని పట్టుకుని ఆటాడుకుంటున్నారు. అప్పుడు ఫ్లై ఓవర్ కూలినందుకు బెంగాల్ లో ప్రభుత్వాన్ని సాగనంపమన్నారు. మరిప్పుడు గుజరాత్ లోనూ అదే
చెబుతారా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.