Begin typing your search above and press return to search.

సాగు చట్టాలపై పార్లమెంట్ లో స్పందించిన మోడీ

By:  Tupaki Desk   |   8 Feb 2021 9:11 AM GMT
సాగు చట్టాలపై పార్లమెంట్ లో స్పందించిన మోడీ
X
రైతుల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విమర్శించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ రాజ్యసభలో సుధీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్ధానికి మార్గనిర్ధేశనం చేసిందని మోడీ కొనియాడారు.

దశాబ్ధాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు లేవని.. రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. చిన్న, సన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. పంట బీమా యోజనను మరింత విస్తరిస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పులు ఉండవని.. చెబుతున్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలియట్లేదని మోడీ వాపోయారు. కొత్త చట్టాల్లో అభ్యంతరాలు ఏంటో చెప్పట్లేదని అన్నారు.

రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సమష్టిగా సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు.

కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదిరిస్తోందని మోడీ అన్నారు. కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపిస్తున్నామన్నారు. కరోనాపై విజయం దేశప్రజలదన్నారు.

ఈ కరోనాతో వచ్చిన ఆర్థికసంక్షోభం భారత్ మరింత బలపడడానికి ఉపయోగపడిందని మోడీ అన్నారు. ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందని.. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు. మానవాళి రక్షణకు భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. ఉగ్రవాదంపై పోరు, టీకా సహా భారత్ బలం ప్రపంచానికి తెలిసిందని మోడీ చెప్పుకొచ్చారు.

ప్రపంచ దేశాల్లోనే అగ్రరాజ్యంగా భారత్ ఎదగడానికి ఇదే సరైన సమయం అని.. దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. భారత్ ప్రస్తుతం ‘ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీస్’గా మారిందని ఆయన స్పష్టం చేశారు.