Begin typing your search above and press return to search.

మోడీ రెమ్యూనరేషన్ ఏడాదికి 5 కోట్లా?

By:  Tupaki Desk   |   20 July 2017 10:02 AM GMT
మోడీ రెమ్యూనరేషన్ ఏడాదికి 5 కోట్లా?
X
మన ఎమ్మెల్యేలు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటారు. అయితే కేంద్ర మంత్రుల జీతం ఎంత? ప్రధాని మోడీ ఎంత వేతనం తీసుకుంటున్నారు. జీతం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒకవేళ ప్రధాని మోడీ తాను రెమ్యూనరేషన్ తీసుకోదలచుకుంటే... నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి రెమ్యూనరేషన్ పుచ్చుకోవాలని అనుకుంటే మాత్రం ఆయనకు కనీసం ఏడాదికి 5 కోట్ల రూపాయలు ముట్టజెప్పాల్సి వస్తుంది. అవునుమరి.. ఆయనతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నిర్మాతకు రెండేళ్లలో కనీసం 10 కోట్ల రూపాయలు లాభంగా వస్తున్నాయట. ఈ నిర్మాత మరెవ్వరో కాదు.. ఆల్ ఇండియా రేడియో వారే! నరేంద్ర మోడి ప్రధాని అయింతర్వాత కొన్నాళ్ళకు అల్ ఇండియా రేడియో ద్వారా ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ద్వారా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పది కోట్ల రూపాయలు ఆల్ ఇండియా రేడియో ఆర్జించినట్లు వార్తలు వస్తున్నాయి.

2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత.. అక్టోబరు నెలలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటికే దేశవ్యాప్తంగా ఆయనకు అపరిమితమైన ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో.. సదరు రేడియో కార్యక్రమానికి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. పేరుకు రేడియో కార్యక్రమం అయినా.. దూరదర్శన్ చానళ్లలో లైవ్ ప్రసారం అయ్యేది. అనంతరం ప్రెవేటు న్యూస్ ఛానెళ్లు అన్నీ కూడా దానిని ప్రసారం చేసేవి. అలా అన్ని రకాలుగానూ ఆ మన్ కీ బాత్ ప్రసంగాలకు పాపులారిటీ పెరిగింది.

ఆదరణ పెరిగిన తర్వాత.. ఆయన స్వయంగా రేడియోలో ప్రసంగించడం పూర్తయిన తరువాత.. అన్ని స్థానిక భాషల రేడియోల్లోనూ ప్రసంగాన్ని ఆయాభాషల అనువాదాలను కూడా ప్రసారం చేయడం ప్రారంభించారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా రీచ్ అయింది. అయితే ఈ ప్రసంగం ఆధునిక యుగంలో మరుగున పడిపోతుందనుకునే ఆల్ ఇండియా రేడియోకు రెండేళ్లలో పదికోట్ల రూపాయలు ఆర్జించి పెట్టడం విశేషం.

మోడీ రెమ్యూనరేషన్ తీసుకోకపోవచ్చుగానీ.. ఇంత లాభసాటి కార్యక్రమానికి కనీసం ఏడాదికి అయిదుకోట్లయినా ఇవ్వాల్సి వస్తుందేమో. భారత ప్రధానికి భత్యాలన్నీ కలుపుకుని 1.60 లక్షల రూపాయల నెలసరి వేతనం లభిస్తుంది. కానీ రేడియో ఆర్జిస్తున్న లాభాల దామాషాలో చూసినట్లయితే.. నెలకు దాదాపు నలభై లక్షల రెవెన్యూను తన ప్రసంగాలద్వారా రాబడుతున్నట్లు. మోడీ క్రేజ్ రేడియో వారికి బాగానే వర్కవుట్ అవుతున్నట్లుంది కదా!