Begin typing your search above and press return to search.

ప్ర‌ణ‌బ్ దా ఇష్యూలో ఎమోష‌న‌ల్ అయిన మోడీ

By:  Tupaki Desk   |   3 July 2017 4:46 AM GMT
ప్ర‌ణ‌బ్ దా ఇష్యూలో ఎమోష‌న‌ల్ అయిన మోడీ
X
రెండు వేర్వేరు ధ్రువాలు ఒక‌రి గురించి మ‌రొక‌రు గొప్ప‌గా చెప్పుకోవ‌టం సాధ్య‌మ‌వుతుందా? అంటే.. రాజ‌కీయాల్లో సాధ్య‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట‌లు వింటే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. రాష్ట్రప‌తిగా ఉన్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గురించి మోడీ తాజాగా ఓపెన్ అయ్యారు. అస‌లుసిస‌లు కాంగ్రెస్ వాదిగా సుప‌రిచితులైన ప్ర‌ణ‌బ్ దాకు ప్ర‌ధాని మోడీకి మ‌ధ్య సైద్ధాంతికంగా ఎంతో వైరుధ్యం ఉంది. అయితే.. త‌మ మ‌ధ్య‌న ఉన్న అనుబంధం వీట‌న్నింటికి మించింద‌న్న విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టారు ప్ర‌ధాని మోడీ.

దేశ ప్ర‌ధ‌మ పౌరుడి హోదా నుంచి ప్ర‌ణ‌బ్ దా మ‌రికొద్ది రోజుల్లో వైదొల‌గ‌నున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌ణ‌బ్ దా రాష్ట్రప‌తి విధుల‌పై ర‌చించిన "ప్రెసిడెంట్ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ - ఏ స్టేట్స్ మ్యాన్" పుస్త‌కాన్ని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో మోడీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడారు.

అనూహ్యంగా ఎమోష‌న‌ల్ అయిన మోడీ.. రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ తో త‌న‌కున్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. ఓ కొడుకును తండ్రి సంర‌క్షించిన‌ట్లే రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ త‌న‌ను చూసుకొన్నార‌న్నారు. త‌న హృద‌యంలో నుంచి వ‌స్తున్న మాట‌లుగా అభివ‌ర్ణించిన మోడీ.. తాను ప్ర‌ధానిగా ఢిల్లీలో అడుగు పెట్టిన వేళ‌లో ప్ర‌ణ‌బ్ చేయి దొర‌క‌టం నిజంగా త‌న అదృష్టమ‌న్నారు.

"మోడీజీ మీరు విశ్రాంతి తీసుకోవాల‌ని ప్ర‌ణ‌బ్ ఎప్పుడూ చెబుతుండేవార‌న్నారు. ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక ప‌ని పెట్టుకొని హ‌డావుడిగా ఉంటారు.. మీ ప‌నుల్లో కొన్నింటికి క‌త్తెర వేయాలి.. ఆరోగ్యంపైన మీరు శ్ర‌ద్ధ చూపాలి" అని అని ప్ర‌ణ‌బ్ చెప్పే వార‌న్నారు. యూపీ ఎన్నిక‌ల వేళ‌లో సైతం ఇలాంటి సూచ‌న‌లే చేసేశార‌న్నారు. ప్ర‌ణ‌బ్ చెప్పిన మాట‌ల‌న్నీ రాష్ట్రప‌తి విధుల్లో భాగం కాద‌ని.. ఆయ‌న చెప్పే మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. స్నేహితుడ్ని కాపాడే ఓ మాన‌వ‌తావాది క‌నిపిస్తార‌న్నారు.

ప్ర‌ణ‌బ్ ఓ స్ఫూర్తి ప్ర‌దాత‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య అంశాల వారీగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండేవ‌ని.. అయితే అవేమీ త‌మ బంధానికి అడ్డు త‌గ‌ల్లేద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ పై త‌న‌కున్న అభిమానాన్ని బ‌య‌ట‌పెట్టిన ప్ర‌ధాని మోడీ మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/