Begin typing your search above and press return to search.

2020 చెడ్డ సంవత్సరం కానేకాదు: మన్ కీ బాత్ లో చైనాకు ప్రధాని హెచ్చరిక

By:  Tupaki Desk   |   28 Jun 2020 10:30 AM GMT
2020 చెడ్డ సంవత్సరం కానేకాదు: మన్ కీ బాత్ లో చైనాకు ప్రధాని హెచ్చరిక
X
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను చూసి బెదిరిపోరాదని, చరిత్ర పొడవునా ఇబ్బందులు ఎదుర్కొని దీటుగా నిలబడిన దేశం మనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా దురాక్రమణ.. కవ్వింపు చర్యలపై ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో స్పందించారు. చైనాతో గొడవలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత బలగాల మృతిపై ఆయన స్పందించారు. దీటుగా బదులిస్తామని తెలిపారు. మన్ కీ బాత్ ద్వారా చైనాకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరితోనూ సఖ్యతగా మెలిగే దేశం మనదని.. నిజమైన స్నేహానికి మనం ఎంతగా ప్రాధాన్యం ఇస్తామో.. తోకజాడింపులకు పాల్పడేవాళ్లకు అంతే దీటుగా బదులివ్వగలమని స్పష్టం చేశారు. భారత బలపరాక్రమాల గురించి, శాంతి పట్ల మనం చూపించే అసాధారణ నిబద్ధత గురించి ప్రపంచానికి తెలుసని పేర్కొన్నారు. మాతృభూమి సంరక్షణలో నేలకొరిగిన అమరవీరులకు దేశం నమస్కరిస్తున్నదని తెలిపారు. వారి శౌర్యప్రతాపాలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయి. వారి త్యాగం వృథా కాబోదని ప్రకటించారు.

పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునే సామర్థ్యం ఇండియాకు ఉందంటూనే... శత్రువులను ఎలా చూసుకోవాలో కూడా తెలుసంటూ చైనాకు ప్రధాని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన చైనాకు దీటుగా బదులిచ్చామని తెలిపారు. లడఖ్ ప్రాంతంలో సవాళ్లు విసిరినవాళ్లకు దీటైన జవాబునే ఇచ్చామని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో జవాన్లను కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత త్యాగాలు చేసిన మన వీరజవాన్లు... విరోధులను గెలవనీయకుండా చేశారని వారి కీర్తిని గుర్తించారు.

కరోనా వైరస్, అంపన్, నిసర్గ తుపాన్లు, సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఇలా ఒకేసారి అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టిన తరుణంలో.. 2020ని చెడ్డ సంవత్సరంగా చాలా మంది భావిస్తుండటం తన దృష్టికి వచ్చిందని, సవాళ్లు ఎదురైనప్పుడు స్థిరంగా పోరాడాలే తప్ప సంవత్సరాలను నిందించడం సరికాదని ప్రధాని పేర్కొన్నారు. 2020ని చెడ్డ సంవత్సరంగా భావించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2020లో మాత్రమే మనం సమస్యలు ఎదుర్కొంటున్నామా? కానేకాదని, ప్రతి సందర్భంలోనూ భారత్ సవాళ్లను తట్టుకుని నిలబడిందని తెలిపారు. సమస్యలకు సృజనాత్మక రీతిలో సమాధానాలు వెతుకుదామని.. ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తిని కొనసాగించాలి. 130 కోట్ల మందిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

విశ్వమహమ్మారి ఉద్భవించిన వెంటనే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి, ఐక్యంగా పోరాడుతుండటం గొప్ప విషయమని మోదీ అభినందించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూనే, ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడేలా ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇలాంటి కీలక తరుణంలో ప్రజలు అత్యంత జాగ్రత్తతతో వ్యవహరించాలని సూచించారు. సామాజిక దూరం.. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.