Begin typing your search above and press return to search.

మోడీ ‘రెయిన్ కోట్’ రచ్చ రచ్చ చేసింది

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:32 AM GMT
మోడీ ‘రెయిన్ కోట్’ రచ్చ రచ్చ చేసింది
X
మాటల్ని తూటాల్లా సంధించటం ప్రధాని మోడీకి చాలాబాగా తెలుసు. ఎలాంటి అమర్యాదకరమైన భాషను ఉపయోగించకుండా చురుకు పుట్టించి.. చిర్రెత్తి పోయేలా ప్రసంగించటం.. ప్రత్యర్థులకు మంట పుట్టేలా మాట్లాడటంలో ఆయన ఎంత నేర్పరి అన్న విషయం బుధవారం రాజ్యసభలో చేసిన ప్రసంగం చెప్పేస్తుందని చెప్పాలి. నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చే క్రమంలో.. భారీ స్కాం జల్లుల నడుమ నాటి ప్రధానిగా మన్మోహన్ రెయిన్ కోట్ వేసుకొని తాను మాత్రం నిజాయితీగా ఉన్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు భారీ ప్రకంపనల్ని సృష్టించాయి. తన కంటే ముందుగా ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారిపై ప్రధాని హోదాలో ఉన్న నేత ఎవరూ.. ఇప్పటివరకూ విమర్శలు చేయటమన్నది లేదని.. అలాంటి వైనానికి మోడీ తెర తీసినట్లుగా విపక్షాలు ఫైర్ అయ్యాయి. పార్లమెంటు లోపలా.. బయటా మోడీ రెయిన్ కోట్ మాటలు రచ్చ రచ్చగా మారాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుకొని పలు పార్టీ నేతలు మోడీ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టాయి. కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి గురువారం రాజ్యసభను స్తంభింపచేశాయి. రెయిన్ కోట్ వ్యాఖ్యలతో ప్రధాని పదవిని మోడీ దిగజార్చినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఇలాంటి వైఖరి గతంలో ఏ ప్రధాని చేయలేదన్న ఆయన.. దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యసభ అట్టుడికిపోయింది. సభా కార్యక్రమాల్ని అడ్డుకున్న రాజకీయ పక్షాలు రాజ్యసభలో నిరసన నినాదాలు చేయగా బీజేపీ ఎంపీలు ప్రతినినాదాలు చేయటంతో సభ దద్దరిల్లింది. మొత్తంగా రెయిన్ కోట్ వ్యాఖ్యలతో రాజ్యసభ నడవలేదు.

లోక్ సభలోనూ రెయిన్ కోట్ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ అంశంపై చర్చజరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినప్పటికీ.. వేరే సభలో జరిగిన చర్చను లోక్ సభలో చర్చించటం సరికాదని.. అలాంటి అవకాశం లేదంటూ స్పీకర్ తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో విపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. మొత్తంగా మోడీ రెయిన్ కోట్ మాట చేసిన రచ్చ అంతాఇంతా కాదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/