Begin typing your search above and press return to search.

గొంతు జీరబోయింది.. కంటతడి పెట్టేశారు

By:  Tupaki Desk   |   28 Sep 2015 3:45 AM GMT
గొంతు జీరబోయింది.. కంటతడి పెట్టేశారు
X
ప్రధాని మోడీ గతంలోకి వెళ్లారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోడీని.. జుకర్ బర్గ్ ప్రశ్నలు వేయటం.. దానికి సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం లభించింది. కుటుంబాల విషయంలో మీకూ మాకూ ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి కదా అని జుకర్ బర్గ్ ప్రశ్నించిన సమయంలో మోడీ గతంలోకి వెళ్లారు.

తన బాల్యం గురించి చెప్పుకున్నరు. తమది చాలా పేద కుటుంబం అని.. మిగిలిన వారి మాదిరే తన జీవితంలోనూ తల్లిదండ్రులు కీలక పాత్ర చాలా కీలకమని చెప్పిన ఆయన.. తాను బాల్యంలో టీలు అమ్మేవాడినని.. తన తల్లి తమను పోషించటానికి ఇంటి పక్కనున్న ఇళ్లల్లో పాచి పని చేసేదని.. నీళ్లు తోడేదని.. అలా సంపాదించిన డబ్బుతో తమను పోషించిందని చెప్పుకొచ్చారు. తన తల్లికి ఇప్పుడు 90 ఏళ్లు అని చెప్పిన మోడీ.. ఇప్పటికి ఆమె తన పనుల్ని తానే చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన గొంతు జీరబోయింది. భావోద్వేగానికి గురైన ఆయన కంట కన్నీరు ఒలికింది.అంతలోనే సర్దుకొని.. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో తనొక్కడికే కాదని.. తన లాంటి వారు చాలామందే ఉన్నరని చెప్పిన మోడీ.. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వేదిక వద్దనే ఉన్న జుకర్ బర్గ్ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ. ‘‘మీ అబ్బాయి ప్రపంచ దృష్టినే మార్చేశాడు’’ అని వ్యాఖ్యానించటమే కాదు.. అందరూ కనిపించేలా వారిని లేచి నిలుచోవాలని వ్యాఖ్యానించారు. భావోద్వేగాలకు గురి చేయటమే కానీ.. భావోద్వేగాలకు గురి కాని మోడీ అందుకు భిన్నంగా వ్యవహరించటం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.