Begin typing your search above and press return to search.

మీడియా చేయ‌లేనిది మోడీ చేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2017 3:57 AM GMT
మీడియా చేయ‌లేనిది మోడీ చేశారు
X
పాల‌నా ప‌రంగా.. రాజ‌కీయంగా ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేసే వారు ఉన్నా.. ఆయ‌న్ను తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్న వారెంద‌రో. ఆయ‌న విధానాల్ని.. పాల‌నా ప‌ద్ధ‌తుల‌తో ఏ మాత్రం ఏకీభ‌వించ‌ని వారెంద‌రో. చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు ఏ మాత్రం పొంత‌న లేని విధంగా ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఈ మ‌ధ్య‌న విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. అంతేకాదు.. కొన్ని అంశాల విష‌యంలో ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాల్ని త‌ప్పు ప‌డుతున్న వారు నెమ్మ‌దిగా పెరుగుతున్నార‌ని చెప్పాలి.

గుజ‌రాత్ రాజ్య‌స‌భ సీటు విష‌యంలో ఆయ‌న అనుస‌రించిన వైఖ‌రితో పాటు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. త‌మిళ‌నాడు విష‌యాల్లో అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదే కాదు.. రాజకీయ అంశాల విష‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌న్న వారే ఉండ‌కూడ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ.. తాజాగా డేరా విధ్వంస‌కాండ‌లో త‌న చేత‌కానిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించిన హ‌ర్యానా ముఖ్య‌మంత్రి ఖ‌ట్ట‌ర్ ను వెన‌కేసుకొచ్చిన వైనం చూసిన‌ప్పుడు ఆయ‌న‌కు కాంగ్రెస్ పాల‌కుల‌కు ఏ మాత్రం తేడా లేద‌ని చెప్పక త‌ప్ప‌దు.

నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నా హింస చోటు చేసుకోకుండా ఉండేలా చేయ‌టంలో హ‌ర్యానా ముఖ్య‌మంత్రి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌న్న మాట దేశంలోని చిన్న‌పిల్లాడికి అర్థ‌మైనా.. చ‌ర్య‌లు తీసుకునేందుకు ప‌వ‌ర్ ఇగో మోడీకి అడ్డుగా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాంగ్రెస్ మూస‌లోనే బీజేపీ సాగుతుంద‌న్న విష‌యాన్ని గ‌డిచిన కొన్ని ఎపిసోడ్ ల‌లో స్ప‌ష్టం చేస్తున్న మోడీ.. తాజాగా మ‌రోసారి మ‌న్ కీ బాత్ పేరిట మ‌రోసారి త‌న నీతిసూక్తుల్ని చెప్పుకొచ్చారు.

ప్ర‌తినెలా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రేడియోలో మ‌న్ కీ బాత్ పేరిట ప్ర‌సంగాలు చేయ‌టం తెలిసిందే. తాజాగా ప్ర‌సంగంలో విశ్వాసం పేరిట హింస‌ను స‌హించేది లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన మోడీ.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. చ‌ట్టం ముందు అంద‌రూ త‌లొగ్గాల్సిందేన‌న్న ఆయ‌న‌.. హ‌ర్యానా.. పంజాబ్ ల‌లో గుర్మీత్ రామ్ ర‌హీం సింగ్ అనుచ‌రులు సృష్టించిన విధ్వంసాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. దోషుల‌కు త‌ప్ప‌నిస‌రిగా శిక్ష ప‌డుతుంద‌న్న మాట చెప్పారు.

ఎప్ప‌టి మాదిరే త‌న మ‌న్ కీ బాత్ లో ఆశ్చ‌ర్య‌పోయే అంశాన్ని ప్రస్తావించారు. యావ‌త్ దేశంలో స్ఫూర్తివంత‌మైన విష‌యాల్ని త‌న మ‌న్ కీ బాత్ లో ప్ర‌స్తావించే మోడీ.. తాజా ఎపిసోడ్ లోనూ అదే తీరును కంటిన్యూ చేశారు. దేశంలో భిన్న‌త్వ‌మ‌న్న‌ది వంట‌కాలు.. జీవ‌న విధానం.. వ‌స్త్ర‌ధార‌ణ‌కే ప‌రిమితం కాలేద‌ని.. ప్ర‌తి విష‌యంలోనూ అది క‌నిపిస్తుంద‌న్న ఆయ‌న ఇటీవ‌ల గుజ‌రాత్ లో చోటు చేసుకున్న వ‌ర‌ద తీవ్ర‌త గురించి ప్ర‌స్తావించారు.

గుజ‌రాత్ వ‌ర‌ద‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఒక విష‌యాన్ని చెప్పిన మోడీ.. అంద‌రి మ‌న‌సుల్ని దోచేశారు. ఇటీవ‌ల గుజ‌రాత్ వ‌ర‌ద‌ల్లో దెబ్బ తిన్న ప్రార్థ‌నాల‌యాల్లో 22 ఆల‌యాలు.. రెండు మ‌సీదులను జ‌మియ‌త్ - ఉలేమా-ఈ- హింద్ సంస్థ‌కు చెందిన వాలంటీర్లు శుభ్రం చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. భిన్న‌త్వంలో ఏక‌త్వంగా చెప్పే ఈ ఉదంతాన్ని ఏ ప్ర‌ముఖ మీడియా సంస్థ బ‌య‌ట‌కు తీసుకురాలేద‌ని చెప్పాలి. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌.. స్ఫూర్తివంత‌మైన విష‌యాన్ని క‌వ‌ర్ చేయాల్సిన మీడియా కంటే ముందుగా మోడీ ఈ విష‌యాన్ని దేశ ప్ర‌జ‌లంద‌రికి చేర‌వేసిన వైనాన్ని అభినందించాల్సిందే. ఇలాంటి కీల‌క విష‌యాల్ని దేశ ప్ర‌జ‌లంద‌రికి త‌న మ‌న్ కీ బాత్ ద్వారా తెలిసేలా చేయ‌టం.. కొత్త శ‌క్తిని ఇవ్వ‌టంలో మాత్రం మీడియా కంటే మోడీ చాలా ముందు ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను చేయాల్సిన ప‌నిని ప్ర‌ధాని చేస్తున్న వైనంపై మీడియా మ‌రోసారి త‌న‌ను తాను ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.