Begin typing your search above and press return to search.

మోడీ పొగడ్తే బాబుకు బర్త్ డే గిఫ్ట్

By:  Tupaki Desk   |   20 April 2016 6:53 AM GMT
మోడీ పొగడ్తే బాబుకు బర్త్ డే గిఫ్ట్
X
కొంతమంది స్నేహితులు ఉంటారు. చెప్పుకోవటానికి మాత్రమే వారు ఫ్రెండ్ తప్పించి.. వారి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కోవలోకే చెందుతుంది మోడీతో చంద్రబాబు ఫ్రెండ్ షిప్. పేరుకు మిత్రుడే అయినా పైసా ప్రయోజనం లేని మోడీతో చంద్రబాబుకు ఎలాంటి లాభం లేదనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీతోకలిసి.. ఏపీని ఏదో చేస్తానని చంద్రబాబు చాలానే కలలుకన్నారు. అయితే.. మోడీ మామూలోడు కాదన్న విషయం చంద్రబాబుకు చాలా త్వరగానే అర్థమైంది. అంతే.. తన అనుభవాన్ని రంగరించి తన మర్యాదను తాను కాపాడుకుంటూ.. ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు కిందామీదా పడుతున్నారు.

తానెంత కష్టపడినా.. తానెంత అవమానపడినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా తగ్గి ఉండాలన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్న చంద్రబాబు.. రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయని మోడీ సర్కారుతో సహనంతో వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు. మరి.. ఇలాంటి శుభదినాన్ని పురస్కరించుకొని మంచి స్నేహితుడిగా మాటల్లో చెప్పుకునే మోడీ నుంచి ఎలాంటి గిఫ్ట్ వచ్చిందన్నది చూస్తే.. ఎప్పటి మాదిరే మోడీ ఒక ట్వీట్ తో చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పేశారు.

ఈ సందర్భంగా మిగిలిన వారితో పోలిస్తే.. బాబును పొగిడేయటం కనిపిస్తుంది. తన మంచి స్నేహితుడిగా చంద్రబాబును అభివర్ణించిన మోడీ.. ఏపీ అభివృద్ధి కోసం ఫ్యాషన్ తో పని చేస్తున్నారంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్సును ప్రసాదించాలంటూ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లుగా మోడీ తన ట్వీట్ తో పేర్కొన్నారు. మాటకు మంచి స్నేహితుడిగా చెబుతున్న మోడీ.. ఆ మంచి స్నేహితుడికి ఉన్న కష్టాల్ని తీర్చేందుకు మోడీ ఎందుకు ప్రయత్నించన్నది అర్థం కాని ప్రశ్న. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు బర్త్ డే విషెస్ సందర్భంగా మోడీ చేసిన ట్వీట్ చూస్తే.. మోడీ మాటల మాయ ఇట్టే అర్థమవుతుంది.