Begin typing your search above and press return to search.

మోడీ 'చిచ్చు' వ్యూహం ఫలిస్తుందా ?

By:  Tupaki Desk   |   4 March 2022 5:30 AM GMT
మోడీ చిచ్చు వ్యూహం ఫలిస్తుందా ?
X
ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను ఎన్డీయే అభ్యర్ధిగా మోడి ఎంపిక చేశారట. కాంగ్రెస్ అభ్యర్ధిని మోడీ ఎంపిక చేయడం ఏమిటి ? ఏమిటంటే కొద్దిరోజులుగా ఆజాద్ ను లాక్కునేందుకు మోడీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆజాద్ కు పద్మ పురస్కారాన్ని కూడా ప్రకటించారు.

నిజానికి ఫక్తు రాజకీయ నేత మాత్రమే అయిన ఆజాద్ కు పద్మ పురస్కారం ఎలా ఇచ్చిందో కేంద్రానికి మాత్రమే తెలియాలి. అప్పుడే అర్ధమైపోయింది మోడీ ప్లాన్ ఏమిటనేది. దానికి తగ్గట్లే ఇపుడు ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఆజాద్ ను నిలపాలని మోడీ డిసైడ్ చేశారు. దేనికంటే ప్రతిపక్షాల తరపున ఇంకెవరు పోటీ చేయకుండా ఉండేందుకే. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున ఎవరినైనా పోటీ చేయిస్తే గెలుపు అవకాశాలు తక్కువ.

అదే కాంగ్రెస్ నేతను ఎంపిక చేస్తే కాంగ్రెస్ తో పాటు యూపీఏ పక్షాలు+ఆజాద్ తో సంబంధాలున్న నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీల అధినేతలు కూడా మద్దతిస్తారన్నది మోడీ భావన. అయితే ఇందుకు అవకాశాలు తక్కువేనని సమాచారం. పైగా దీనివల్ల మోడీకి కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువని టాక్. బీజేపీపై ముస్లిం వ్యతిరేక ముద్ర చెరిపేసుకోవాలంటే బీజేపీలోనో లేకపోతే ఎన్డీయే పార్టీల్లోని ముస్లిం నేతనే పోటీకి దింపితే సరిపోతుంది.

అయితే అప్పుడు సమస్య ఏమిటంటే గెలిచేది అనుమానమే. అందుకనే మోడీ ఇలాంటి వ్యూహం పన్నారు. మరి మోదీ వ్యూహంలో కాంగ్రెస్, యూపీఏ పక్షాలు చిక్కుకుంటాయా ? అన్నది చూడాలి. ఆజాద్ కూడా మానసికంగా రెడీ అయిపోయారట. అందుకనే వివిధ పార్టీలతో మంతనాలు మొదలు పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగితే ఎంపీలు, ఎంఎల్ఏలు ఓట్లేయాలి. రాష్ట్రపతిగా ఎంపికవ్వాలంటే 5, 49,452 ఓట్లు రావాలి. ప్రస్తుతం బీజేపీకి 4,74,102 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

పోయిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు 7,02,440 ఓట్లొచ్చాయి. అవసరానికి మించి ఎలా వచ్చాయంటే అన్నాడీఎంకే, జేడీయూ, బీజేడీ, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, శివసేన, అకాలీదళ్ తో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చాయి. తాజా పరిణామాల్లో ఒకటి రెండు పార్టీలు మినహా మద్దతిచ్చే అవకాశాలు లేవు. పైగా టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన పూర్తిగా వ్యతిరేకమైపోయాయి. ఐదు రాష్ట్రాల్లో పరిస్దితులు ఏమిటో ఇప్పుడే చెప్పలేం. అందుకనే వ్యూహాత్మకంగా మోడీ ప్రతిపక్షంలో చిచ్చుపెట్టి తాను అనుకున్న అభ్యర్థిని గెలిపించుకోవాలని అనుకున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.