Begin typing your search above and press return to search.

ట్వీట్ తో యూత్ ను లైన్లోకి తీసుకున్న మోడీ

By:  Tupaki Desk   |   27 Nov 2016 8:26 AM GMT
ట్వీట్ తో యూత్ ను లైన్లోకి తీసుకున్న మోడీ
X
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నోట్ల రద్దు అంశంపై గడిచిన మూడు వారాలుగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలిసిందే. ఓపక్క రద్దు కారణంగా చిల్లర నోట్ల కొరత తీవ్రంగా ఉండటం.. బ్యాంకుల చుట్టూ.. ఏటీఎం సెంటర్ల దగ్గరా భారీగా క్యూలో నిలుచున్న జనాలు తీవ్ర అసహనానికి.. ఆగ్రహానికి గురి అవుతున్నారు. కేంద్రం మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. నగదు కొరత కారణంగా ఒక వ్యక్తికి తన అకౌంట్లో ఉన్న మొత్తంలో వారానికి రూ.24వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆ మొత్తాన్ని ఇవ్వటం లేదు. అదేమంటే.. తమకు కరెన్సీ రావటం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని విపక్షాలు మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. వరుస విమర్శలు చేస్తూ.. ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీని సమర్థించే వారు సైతం.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని లేనిపోని తలనొప్పుల్ని మోడీ తెచ్చి పెట్టుకున్నట్లున్నారే? అన్న భావనకు గురైన వారూ ఉన్నారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని అంత సమర్థంగా అమలు చేసిన మోడీ.. నోట్ల కొరత చోటు చేసుకోకుండా ఉండే విషయంలో మాత్రం తప్పులో కాలేశారంటూ పలువురు తప్పు పట్టే పరిస్థితి. ఇలాంటి విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నా.. మోడీ మాత్రం కొరత మీద మాట్లాడింది లేదు. పెదవి విప్పింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం మోడీ ఈ మధ్యలో ఎప్పుడూ లేనట్లుగా ఒక ట్వీట్ చేశారు. నోట్ల రద్దు కారణంగా కరెన్సీ నోట్ల కష్టాల్ని ప్రస్తావించని మోడీ.. ఆధునిక టెక్నాలజీని వాడాల్సిన సమయం వచ్చేసిందని.. ఈ బ్యాకింగ్.. మొబైల్ బ్యాకింగ్ లాంటి సాంకేతికతను వాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని.. ఈ విషయంలో యువత ముందుండాలని కోరటం గమనార్హం. మేరా మొబైల్.. మేరా బ్యాంక్.. మేరా బట్వా అంటూ ట్వీట్ చేసిన తీరు చూస్తే.. కరెన్సీ వినియోగం మీద దృష్టి తగ్గించి.. ప్లాస్టిక్ కరెన్సీని వాడుకలోకి తీసుకురావాలన్న సందేశం ఇచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/