Begin typing your search above and press return to search.

మోడీ ఫొటోపై అభ్యంతరం.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   21 Dec 2021 5:30 PM GMT
మోడీ ఫొటోపై అభ్యంతరం.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు
X
దేశాన్ని పాలించే పాలకులు చేసే సేవా కార్యక్రమాలపై వారి ఫొటోలు ఉండడం సహజమే. ఎందుకంటే కేంద్రప్రభుత్వమే దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తోంది. ఉచితం వద్దనుకుంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేసుకోవచ్చు. అయితే కొందరు ఉచితంగా తీసుకుంటూ ప్రధాని మోడీ ఫొటో సర్టిఫికెట్లపై ఉండడాన్ని తప్పు పడుతున్నారు. ఇదే వివాదాస్పదమైంది.

కోవిడ్19 వ్యాక్సిన్ సర్టిఫికెట్ లపై ప్రధాని చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదా ఔచిత్యం లేదంటూ పిటీషనర్ పీటర్ మైల్ పరంబిల్ అక్టోబర్ నెలలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటీషన్ ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

అంతేకాదు ఈ పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఈ పిటీషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని.. ప్రజా ప్రయోజనాల కోసం కాదని కేవలం ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది.

ఈ పిటీషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ మాట్లాడుతూ 'ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని.. బీజేపీ ప్రధాని అని కానీ లేదా ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని పదవికి ఎన్నికైతే ఆయన మన దేశానికి ప్రధానమంత్రి' అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ విధానాలపైన లేదా ప్రధానమంత్రి రాజకీయ వైఖరిపై కూడా విభేదించే హక్కు పౌరులకు ఉంది. పౌరులకు ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధాని ఫొటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

ప్రజా తీర్పుతోనే మోడీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటీషనర్ కు రూ.1లక్ష జరిమానా విధించింది హైకోర్టు. పైగా ఆరువారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(కేఎల్ఎస్ఏ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతడి ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది.

కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు అలాంటి అనవసరమైన పిటీషన్లను ప్రోత్సహించలేము అని కూడా హెచ్చరించింది.