Begin typing your search above and press return to search.

టీకా స‌ర్టిఫికెట్ పై మోడీ ఫొటో, సీనియ‌ర్ ఎడిట‌ర్ సెటైర్!

By:  Tupaki Desk   |   22 Sep 2021 8:30 AM GMT
టీకా స‌ర్టిఫికెట్ పై మోడీ ఫొటో, సీనియ‌ర్ ఎడిట‌ర్ సెటైర్!
X
దేశంలో క‌రోనా వ్యాప్తి నివార‌ణ టీకా విష‌యంలో క్రెడిట్ అంతా మోడీకి ద‌క్కాల‌నేది బీజేపీ ప్ర‌భుత్వ ఆలోచ‌న కావొచ్చు. ఇటీవ‌లే మోడీ పుట్టిన రోజు సంద‌ర్భంగా కూడా ప్ర‌త్యేకంగా టీకా ఉత్స‌వ్ ను నిర్వ‌హించారు. ఒకే రోజు రెండున్న‌ర కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు. అయితే ఆ మ‌రుస‌టి రోజు మాత్రం అంత సీన్ లేక‌పోయింది. అదే ఫీట్ ను రెండో రోజు కూడా చేసి ఉంటే వ్యాక్సినేష‌న్ భారీ ఎత్తున పూర్త‌య్యేది. అయితే కేవ‌లం మోడీ పుట్టిన రోజు సంద‌ర్భంగా భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ను నిర్వ‌హించార‌నిపించారు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇండియాలో వ్యాక్సినేష‌న్ రెండు డోసులు పొందిన వారు అందుకు సంబంధించిన స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. ఆ స‌ర్టిఫికెట్ కీల‌కం కూడా. ప్ర‌త్యేకించి రాష్ట్రాలు దాటాల‌నుకునే వారికి, విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారికి వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం ఏర్ప‌డుతుండ‌వ‌చ్చు. విదేశాల‌కు వెళ్లిన వారికి అయితే రెస్టారెంట్లు, షాపుల్లోకి వెళ్ల‌డానికి కూడా స‌ర్టిఫికెట్ చూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చు. కాబ‌ట్టి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ఉంచుకోవ‌డం చాలా మంచి ప‌ని.

అయితే ఇండియాలో ఇస్తున్న ఈ స‌ర్టిఫికెట్ తీరుతెన్నుల‌పై సెటైర్ పేల్చారు సీనియ‌ర్ సంపాద‌కుడు సిద్ధార్థ్ వ‌ర‌ద‌రాజ‌న్. త‌నకు పారిస్ లో ఎదురైన అనుభ‌వం గురించి ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒక క‌ఫేలో ఉన్న‌ప్పుడు వెయిట‌ర్ వ‌చ్చి త‌న‌ను వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ అడిగాడ‌ని, త‌ను దాన్ని చూప‌గా.. అందులో ఉన్న ఫొటో మీది కాదు క‌దా.. అన్న‌ట్టుగా ఆ వెయిట‌ర్ వాద‌న‌కు దిగాడ‌ని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఆ ఫొటోలో ఉన్న‌ది త‌ను కాద‌ని, త‌మ ప్రియ‌త‌మ నేత అని వ‌ర‌ద‌రాజ‌న్ చెప్పాడ‌ట‌. అయితే ఆ వెయిట‌ర్.. నీ స‌ర్టిఫికెట్ పై ఆయ‌న ఫొటో ఎందుకు ఉంది? అంటూ త‌న‌ను ప్ర‌శ్నించాడ‌ని ఈ ఎడిట‌ర్ ట్వీట్ చేశారు!

వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ పై మోడీ ఫొటో ఉందంటూ ఆయ‌న ఇలా సెటైర్ పేల్చారు. ఎవ‌రి వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ పై వారి ఫొటోకు బ‌దులు మోడీ ఫొటో ఏమిట‌న్న‌ట్టుగా ఉంది ఈ ఎడిట‌ర్ ట్వీటు!