Begin typing your search above and press return to search.

ఏపీ ‘లోకల్’కు మోడీ ఓకే చేసేశారు

By:  Tupaki Desk   |   8 Jun 2016 4:44 AM GMT
ఏపీ ‘లోకల్’కు మోడీ ఓకే చేసేశారు
X
ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ స్థానికత అంశం తెర మీదకు రావటం.. దీనికి సంబంధించిన ఏపీ సర్కారు ప్రతిపాదన కేంద్రానికి వెళ్లటం తెలిసిందే. విభజన నేపథ్యంలో రాజధానిలో పని చేసే ఉద్యోగులు.. రాజధానిలో స్థిరపడిన పలువురితో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏపీ ప్రాంత ప్రజల స్థానికత అంశంపై తర్జనభర్జనలు జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ముందుకొచ్చి 2017 జూన్ 2 లోపు ఏపీలో నివాసం ఉన్న వారంతా ఏపీ లోకల్ అవుతారన్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీనికి ఆమోదముద్ర వేసేందుకు వీలుగా కేంద్రానికి పంపింది.

నెలలు గడుస్తున్నా దీనికి సంబంధించిన ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం ఏమైనా కొర్రీలు పెడుతుందా? అన్న సందేహం వ్యక్తమైంది.అయితే.. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా తాజాగా స్థానికత అంశంపై ప్రధాని మోడీ కార్యాలయం ఓకే చేసేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం ఆయన కార్యాలయానికి ఫైలును పంపారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో.. ఏపీ స్థానికత అంశం ఒక కొలిక్కి రావటంతో పాటు.. 2017 జూన్ 2 లోపు ఏపీకి వెళ్లే వారంతా ఏపీ స్థానికులుగా గుర్తింపు పొందనున్నారు.

మామూలుగా అయితే.. గడిచిన ఏడేళ్ల వ్యవధిలో చివరి నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ ప్రాంతానికే విద్యార్థి లోకల్ అవుతారు. ఉద్యోగాల విషయంలోనూ లోకల్ పోస్టులకు కనీస విద్యార్హతకు ముందు ఏడేళ్ల వ్యవధిలో నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్ గా లెక్కలోకి తీసుకుంటారు. విభజన నేపథ్యంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని సీమాంధ్రులకు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. దీంతో.. లోకల్ చిక్కుముడుల్ని తీసేందుకు వీలుగా ‘స్థానికత’ అంశంపై ఏపీ సర్కారు ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది.

2017 జూన్ 2 లోపు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఏపీ స్థానికత వర్తించేలా ప్రతిపాదనను సిద్దం చేసి కేంద్ర ఆమోదానికి పంపింది. తాజాగా ఈ అంశంపై పీఎంవో ఓకే అంటూ రాజముద్ర వేయటంతో.. అంతిమంగా రాష్ట్రపతి ఆమోదముద్ర మాత్రమే మిగిలి ఉంది. ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేసి పంపుతారని చెబుతున్నారు. రాష్ట్రపతి ఓకే చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయటంతో ఏపీ స్థానికత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు అవుతుందని చెప్పొచ్చు.